బాబు జిల్లాలో జగన్

Submitted by arun on Fri, 12/29/2017 - 18:48
PrajaSankalpaYatra

అన్ని జిల్లాలూ ఒక ఎత్తు చిత్తూరు జిల్లా మరో ఎత్తు అంటున్నారు వైసీపీ నేతలు. జగన్‌ పాదయాత్ర మూడు జిల్లాల్లో కంప్లీట్‌ చేసుకొని చిత్తూరు జిల్లాలోకి ఎంటరవడంతో సూపర్‌ సక్సెస్‌ చేసేందుకు ఎక్కడికక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో సత్తా చాటేందుకు వ్యూహరచన చేస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకి షాకిచ్చినట్లే 2019లోనూ మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకు వైసీపీ నేతలు పావులు కదుపుతున్నారు.

2019లో అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మొదలుపెట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర కడప, కర్నూలు, అనంతరం జిల్లాల్లో పూర్తిచేసుకుని చిత్తూరు జిల్లాలోకి ఎంటరైంది. చిత్తూరు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జగన్‌ పాదయాత్రను జిల్లాలో సూపర్‌ సక్సెస్‌చేసే బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో భారీ జనసమీకరణతోపాటు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

తంబళ్లపల్లె ఎద్దులవారికోట నుంచి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర మొదలుపెట్టిన జగన్‌కు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. మొత్తం 26రోజులపాటు చిత్తూరు జిల్లాలో జగన్‌ నడక సాగనుంది. తంబళ్లపల్లె, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, చంద్రగిరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల మీదుగా మొత్తం 260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుంటే గత ఎన్నికల్లో వైసీపీ 8 చోట్ల విజయం సాధించి చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి షాకిచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా చిత్తూరులో మాత్రం బాబుకి పట్టు దక్కకుండా పోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో కూడా చిత్తూరు జిల్లాలో మెజారిటీ స్థానాలు తామే గెలుచుకుంటామని వైసీపీ ధీమాగా చెబుతోంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ పాదయాత్ర ఒక ఎత్తు అయితే చిత్తూరు జిల్లాలో మరో ఎత్తు అంటున్నారు వైసీపీ నేతలు.


 

English Title
ys jagan prajasankalpayatra in chittoor

MORE FROM AUTHOR

RELATED ARTICLES