రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ మద్దతు ఏ పార్టీకంటే...

Submitted by arun on Sat, 07/21/2018 - 11:50
jagan

రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిస్తారని మీడియా అడిగిన ప్రశ్నకు వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఒక్క మాటతో తేల్చేశారు. కాకినాడ పాదయాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. ఎవ‌రైతే ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని సంత‌కం చేస్తారో వారికే మ‌ద్ద‌తిస్తామని ఈ సందర్భంగా తేల్చిచెప్పేశారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు అనుసరించిన వైఖరి పట్ల  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల బలీయమైన ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను, రాష్ట్ర సమస్యలను పట్టించుకోకుండా అవిశ్వాసంపై చర్చలో తమ ఎజెండాను మాత్రమే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రస్తావించాయని ఆయన తప్పుబట్టారు. 

అవిశ్వాసం చర్చలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతోపాటు టీడీపీ ఎంపీలు వ్యవహరించిన తీరును దుయ్యబట్టారు. పార్లమెంటులో ఆయా పార్టీలు వ్యవహరించిన తీరుకు నిరసనగా, ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ముమ్మరం చేయడంలో భాగంగా మంగళవారం (ఈ నెల 24న) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఈ బంద్‌ చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవిశ్వాస చర్చ సందర్భంగా పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై  శనివారం ఆయన స్పందించారు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజికి అంగీకరించి, రాష్ట్ర హక్కును తాకట్టు పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎవరని వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

English Title
ys-jagan-calls-andhra-pradesh-bandh-tuesday

MORE FROM AUTHOR

RELATED ARTICLES