నవాబుల గడ్డలో జెండా పాతేదెవరు?

నవాబుల గడ్డలో జెండా పాతేదెవరు?
x
Highlights

ఒకప్పటి నవాబుల గడ్డ. ఇప్పుడ ఫ్యాక్షన్ అడ్డా. ఆ నేలపై జెండా పాతేందుకు ముగ్గురు యోధులు కత్తులు దూశారు. నవాబుల కోటను తమ వశం చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు...

ఒకప్పటి నవాబుల గడ్డ. ఇప్పుడ ఫ్యాక్షన్ అడ్డా. ఆ నేలపై జెండా పాతేందుకు ముగ్గురు యోధులు కత్తులు దూశారు. నవాబుల కోటను తమ వశం చేసుకునేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది మరి ఎవరిదా కోట ఎవరి చేతికి చిక్కింది నవాబుల పేట..? కర్నూలు జిల్లా బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరు గెలుపు పొందుతారన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. టిడిపి నుంచి ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి బరిలో దిగగా, వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోటీలో నిలిచారు.

పోలింగ్ కూడా హోరాహోరీగా సాగింది. నియోజకవర్గంలో పోలింగ్ శాతం 80.48గా నమోదైంది. ఎన్నికలకు నెలరోజుల ముందు వరకు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, బడా నాయకుల నిర్ణయంతో ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి అధికార తెలుగుదేశంను వీడి వైఎస్సార్సీపీలో చేరడం, ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న బిజ్జం పార్థసారధి రెడ్డి కాటసాని వర్గంలో, చేరి ఎన్నికల చివరి నిమిషంలో ఏకమవడంతో ఉత్కంఠను రేకెత్తించాయి.

ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డికి 2014 ఎన్నికల్లో మద్దతుగా ఉన్న ఇరువురు నాయకులు చివరి నిమిషంలో టిడిపిని వీడి వైఎస్సార్సీపీలో చేరడంతో, టిడిపిలో కాస్త గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తమ కుటుంబం చేసిన సేవా కార్యక్రమాలు, అధికార టిడిపి ప్రజా సంక్షేమ పథకాలే నమ్ముకుని ప్రచారం చేశారు. ఇక వైసిపి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి ఈసారి బనగానపల్లె కోటలో తమ జెండా ఎగరటం లాంఛనమే అంటున్నారు. తన గెలుపు కోసం బలమైన వర్గం కష్టించి పనిచేయటం అందుకు కారణంగా చెప్తున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జగన్‌ ఇచ్చిన పిలుపుకు బనగానపల్లె ప్రజలు బ్రహ్మరథం పట్టారని అంటున్నారు.

దివంగత నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె అరవింద రాణి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేయటంతో, ప్రజలను ఓట్లు అడిగే విధానంలో కాస్త తడబాటు స్పష్టంగా కనిపించింది. కానీ తన తండ్రికి ఉన్న ఇమేజ్, ఆయన చేసిన సేవా కార్యక్రమాలు స్థానిక ఎంపీ కావడంతో అవి కూడా తన గెలుపుకు కారణాలయ్యే అవకాశం లేకపోలేదన్నది ఆమె వర్గీయుల వాదన. విజయం మాట ఏమో కానీ నేతల ఓట్లు మాత్రం చీల్చడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట. ఇటు మైనారిటీల్లో, అటు కాపుల్లో, దిగువ తరగతి శ్రేణుల్లో తన తండ్రి చేసిన కార్యక్రమాలకు కచ్చితంగా ఫలితం దక్కుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అటు పెద్ద మొత్తంలో యువత కూడా జనసేన వైపు అడుగులు వేశారన్నది వారి అభిప్రాయం. నేతలు ఎంతమంది పోటీచేసినా, పార్టీలు ఎన్నివున్నా, ప్రధాన పోటీ మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్యే. గెలుపుపై ఇద్దరు నేతల ధీమా ఏ మాత్రం తగ్గటం లేదు. మరి నవాబుల గడ్డ ఎవరికి పట్టం కడుతుందో, బనగానపల్లెకు ఎవరిని బాద్షా చేస్తుందో 23వ తేదీ తేలిపోతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories