తెలుగు జాతికి ఇది పండగ వేళ

Submitted by admin on Tue, 12/12/2017 - 12:44

తెలుగు జాతికి ఇది పండగ వేళ. తెలుగు వెలుగులను ప్రపంచానికి పంచే అద్భుతమైన వేళ. తెలుగు భాషా వికాసాలను దశ దిశల ప్రసరింప జేసే వేళ. అవును ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌ ముస్తాబైంది. అసలు ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడెప్పుడు జరిగాయి.? ఎలా జరిగాయి.? 

 హైదరాబాద్‌లో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ ఐదు రోజులు తెలుగు భాషాభిమానులకు నిజమైన పండగ రోజులు. ఎల్బీ స్టేడియం, రవీంద్రభారతి, శిల్పకళావేదిక, తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియం, హరిహరకళాభవన్, భారతీయ విద్యాభవన్ వంటి వేదికలన్నింటిపైనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ సభల సందర్భంగా తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్ట సంప్రదాయ జానపద కళారూపాలు, గజ్జెల మోతలతో రాజధాని హైదరాబాద్ నగరం దద్దరిల్లేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది ప్రభుత్వం. 

1972-73లో ఉధృతంగా సాగిన జై ఆంధ్ర ఉద్యమం చల్లారిన తర్వాత నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 12 నుంచి 18 వరకు లాల్‌బహదూర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలకు ప్రతిరోజు సుమారు లక్ష మంది ప్రజలు వచ్చి ఉంటారని ఓ అంచనా. 

 ఇక 1981, 1990లో రెండు, మూడు ప్రపంచ తెలుగు మహాసభలు నాటి  ముఖ్యమంత్రులు టి.అంజయ్య, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అదీ విదేశీ గడ్డైలెన మలేషియా, మారిషస్‌లలో ఇబ్బందులు లేకుండా నిర్వహించడం విశేషం. 2012లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు, ఆ రాష్ట్ర చరిత్రలో తొలివి. వరుస క్రమంలో అయిదోది. నవ తెలంగాణ అన్ని వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న కేసీఆర్‌ తెలుగు భాషా సంస్కృతుల వికాసాన్ని ఈ సభల ద్వారా చాటనున్నట్టు చెబుతున్నారు. నిజానికి రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు వారిగా కలిసి ఉండటంలో ఏమాత్రం తప్పులేదు. తెలుగు భాషా, సంస్కృతుల సంరక్షణకు తెలుగు కవులు చేసిన కృషిని ఈ సభల ద్వారా చాటి చెప్పాల్సిన తరుణమిది. 

ఇలాంటి వేదికల ద్వారా భావోద్వేగాలకు అతీతంగా వారు పడిన శ్రమను చరిత్రలో నిక్షిప్తం చేసినట్లవుతుందంటున్నారు తెలుగు పండితులు. ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయిలైన తెలుగు వారు కూడా ఎంతో ఆనందించే పరిణామం ఇది. ఈ మహాసభల స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషా సంస్కృతులు ఫరిడవిల్లాలని తెలుగు భాషాభిమానులుగా మనమందరమూ ఆకాంక్షిద్దాం.

English Title
world-telugu-conference-2017-telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES