అయోధ్యకాండలో అంతుపట్టని నిజాలు

అయోధ్యకాండలో అంతుపట్టని నిజాలు
x
Highlights

అయోధ్యపై సుప్రీం కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్‌ లలిత్ తప్పుకోవడంతో, వాదనలు పోస్ట్‌పోన్ చేసింది. ఎన్నికల్లో...

అయోధ్యపై సుప్రీం కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్‌ లలిత్ తప్పుకోవడంతో, వాదనలు పోస్ట్‌పోన్ చేసింది. ఎన్నికల్లో రామాస్త్రాన్ని సంధించాలని భావిస్తున్న నరేంద్ర మోడీ దూకుడుకు, న్యాయస్థానం వాయిదా....బ్రేకేసినట్టయ్యింది. అయితే సుప్రీం కోర్టు వాయిదాలపై కొందరు కాషాయ నేతలు, రాజకీయ భాష్యాలు జోడించడం కలకలం రేపుతోంది. మరోవైపు దశరథుని కోటలోని పది వేల గదుల్లో, రాముడు ఏ గదిలో జన్మించాడంటూ, మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో, అయోధ్య అస్త్రాన్ని ఎప్పుడెప్పుడు సంధిద్దామా అని ఎదురుచూస్తున్న నరేంద్ర మోడీ సర్కారుకు, సుప్రీం కోర్టు వాయిదా, బ్రేకులేస్తోంది. కోర్టుల్లో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అయోధ్య ప్రాధాన్యతా అంశమే కాదని వ్యాఖ్యలు చేస్తూ, గతేడాది అక్టోబర్‌లో వాయిదా వేసిన సుప్రీం కోర్టు, తాజాగా మరోసారి మోడీ ప్రభుత్వానికి షాకిచ్చింది. విచారణను జనవరి 29కి వాయిదా వేసింది.

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై వాదనలు వినేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో, రాజ్యాంగ ధర్మాసనాన్ని ఇంతకముందే ఏర్పాటు చేసింది కోర్టు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలో ఏర్పాటైన ఈ బెంచ్‌లో, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎ. బోబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, జస్టిస్‌ యు.లలిత్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లున్నారు. ధర్మాసనం గురువారమే విచారణ ప్రారంభించింది. అయితే బెంచ్‌లో ఒకరైన జస్టిస్‌ యు.లలిత్‌ విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో విచారణను జనవరి 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది కోర్టు. అంతేకాదు, కొత్త రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేస్తామని న్యాయస్థానం తెలిపింది. తాజా వాయిదాకు ప్రధాన కారణం జస్టిస్ లలిత్, బెంచ్‌ నుంచి తప్పుకోవడం. ఆయన రాజ్యాంగ ధర్మాసనం నుంచి తప్పుకోవడానికి కారణం సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం. జస్టిస్‌ లలిత్‌ గతంలో ఇదే కేసులో కల్యాణ్‌సింగ్‌ తరఫున వాదించారు. దీంతో రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ లలిత్‌ సభ్యులుగా ఉండటంపై న్యాయవాది ధవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో జస్టిస్ లలిత్‌ విచారణ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. సుప్రీం కోర్టు ప్రస్తుత వాయిదాకు ఇదే ప్రధాన కారణం. జనవరి 29 నుంచి కొత్త ధర్మాసనం వాదనలు వింటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories