గుంతకల్లులో జనసేన ఏ పార్టీ ఓట్లు చీల్చింది?

గుంతకల్లులో జనసేన ఏ పార్టీ ఓట్లు చీల్చింది?
x
Highlights

గుంతకల్లు. రైల్వే జంక్షన్‌గా పాపులరైంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా, జంక్షన్‌లానే సాగాయి. ఎందుకంటే, తెలుగుదేశం, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ...

గుంతకల్లు. రైల్వే జంక్షన్‌గా పాపులరైంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూడా, జంక్షన్‌లానే సాగాయి. ఎందుకంటే, తెలుగుదేశం, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ అనుకుంటే, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా జనసేన ఎంట్రీతో, ట్రయాంగిల్‌ వార్‌గా మారిపోయింది. మరి గుంతకల్‌ జంక్షన్‌లో జామ్‌ అయ్యేది ఎవరికి? గ్రీన్‌ సిగ్నల్ లభించేది ఏ పార్టీకి? ఆరెంజ్‌ సిగ్నల్‌తో దడ పుట్టిస్తున్న జనసేన, రెండు పార్టీల్లో ఎవరికి రెడ్‌ సిగ్నల్‌ వేయబోతోంది?

అనంతపురం జిల్లా గుంతకల్లు, రాష్ట్రంలోని హాట్‌ సీట్స్‌లో ఒకటిగా మారింది. ఎందుకంటే, ఇక్కడ త్రిముఖ పోరు ఉత్కంఠ కలిగిస్తోంది. గుంతకల్లు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ, వైసీపీలతో పాటు జనసేనకు బలమైన అభ్యర్థి ఇక్కడ పోటీలో ఉండడంతో, ఓటరు ఎటువైపు మొగ్గుచూపారన్నది క్యూరియాసిటీ పెంచుతోంది. జనసేనకు ఏ పార్టీ ఓట్లు చీలాయన్న ఉత్కంఠ నెలకొంది.

టీడీపీ నుంచి తాజా ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరోమారు బరిలో ఉన్నారు. వైసీపీ నుంచి వై. వెంకట్రామిరెడ్డి పోటీలో నిలిచారు. చివరి వరకూ టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించి ఆఖరు నిమిషంలో జనసేనలో చేరిన మధుసూదన్ గుప్తా ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. నియోజకవర్గంలో కలియతిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు.

నియోజకవర్గంలో 2,52,372 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1,25,509 మంది, స్త్రీలు 1,26,792 మంది, ఇతరులు 71 మంది. ఈ ఎన్నికల్లో మొత్తం75.81 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల్లో 74.11 శాతం పోలింగ్ రికార్డయ్యింది. గతంతో పోలిస్తే 1.7 శాతం పోలింగ్ పెరిగింది. నియోజకవర్గంలో గుంతకల్లు, గుత్తి, పామిడి మున్సిపాలిటీలు ఉన్నాయి. పామిడి, గుత్తి, గుంతకల్లు మండలాలు ఇందులోకి వస్తాయి. అర్బన్‌లో కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా, రూరల్‌లో ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. ఈ ఎఫెక్ట్‌ ఎవరికన్నది ఆసక్తి కలిగిస్తోంది.

ముందు నుంచి గుంతకల్లు పట్టణం, రూరల్‌లో టీడీపీకి పట్టుందని ఆ పార్టీ నేతల మాట. ఈ ఎన్నికల్లో మరోమారు టీడీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ ఆర్ సీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి 2014లో వైఎస్ఆర్ సీపీ తరఫున పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి జితేంద్ర గౌడ్ చేతిలో ఓటమిపాలయ్యారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదన్నది ఉత్కంఠగా మారింది. 2009 లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా, టీడీపీ అభ్యర్థి సాయినాథ్ గౌడ్‌పై 9,344 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినా టికెట్ దక్కక పోవడంతో చివరికి జనసేనలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. రెండు పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు గుప్తా.

గుంతకల్లు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోరు నెలకొనడంతో గెలుపు ఎవరిదన్నది సంక్లిష్టంగా మారింది. గుంతకల్లులో జనసేన జెండా ఎగరనుందని ఆ పార్టీ నేతల కాన్ఫిడెన్స్. నియోకవర్గంలో సుమారు 20 వేల మంది జనసైనికులు ఉన్నారని, సైలెంట్ ఓటింగ్ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్య ఉంటుందని ఇరు పార్టీల నేతలు వాదన. జనసేకు పెద్ద ఎత్తున ఓట్లు పోలయ్యాయని, అవి ఏ పార్టీకి చెందినవి అన్నది, మిగతా అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది.

మరోమారు గుంతకల్లులో టీడీపీ విజయం సాధించి పట్టు నిలుపుకుంటుందా వైసీపీ తొలిసారి పాగా వేయనుందా అన్న సస్పెన్షన్ కొనసాగుతోంది. గుంతకల్లు రైల్వే డివిజన్ దక్షిణ మధ్యరైల్వే జోన్ లోనే అత్యధిక ఆదాయం సమకూరుస్తుంది. ప్రముఖ వాణిజ్య కేంద్రం. కర్ణాటకకు ఆనుకొని ఉండడంతో పాటు కర్నూలు జిల్లాకు సరిహద్దుగా ఉంది. మైనార్టీ ఓటుబ్యాంకు అధికంగా ఉండే గుంతకల్లులో ఈసారి ఎవరు విజయం సాధిస్తారన్నది సస్పెన్స్‌గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories