ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారం..?

Submitted by arun on Sat, 08/04/2018 - 10:38

చిత్రసీమతో పాటు రాజకీయాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన అన్న నందమూరి తారకరామారావుకు భారతరత్న పురస్కారం లభించనుందా..? తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రపంచానికి చాటిన ఘనుడు ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించనున్నారా..? హస్తిన నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఈ యేడు ప్రకటించే పద్మ పురస్కారాల లిస్టులో అన్నగారి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

పద్మ పురస్కారాల్లో అత్యున్నతమైన భారతరత్న అవార్డును ఈ యేడు తెలుగువ్యక్తికి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు చిత్రసీమనే కాకుండా రాష్ట్రం నుంచి ఢిల్లీ దాకా రాజకీయాలను శాసించిన నందమూరి తారకరామారావుకు భారతరత్న అవార్డుకు ఎంపిక చేస్తారని తెలుస్తోంది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని అంతకుముందు ఎవరికీ సాధ్యం కాని విధంగా పాలించి హస్తినలో చక్రం తిప్పిన తెలుగోడికి ఈ యేడు దేశం గర్వించదగ్గ పురస్కారం లభించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

బహుముఖ ప్రతిభకు నిలువుటద్దం అయిన ఎన్టీఆర్‌కు భారతరత్న ద్వారా సత్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ గత కొంతకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఢిల్లీ కేంద్రంగా చాలాకాలంగా ఆందోళన కూడా నిర్వహిస్తోంది. ఢిల్లీ పెద్దలకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడం ద్వారా ఆంధ్రులకు దగ్గర అయ్యేందుకు ఉపకరిస్తుందనే ఉద్దేశ్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు భావిస్తోందని వివరిస్తున్నారు. 

యేటా గరిష్టంగా ముగ్గురు ప్రముఖులకు భారతరత్నకు నామినేట్ చేసే సంప్రదాయం వస్తోంది. అందుకు తగ్గట్లుగా పేర్లను నామినేట్ చేసిన ప్రధాని లిస్టును రాష్ట్రపతికి పంపించడం ఆ తర్వాత ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈసారి నలుగురికి ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ నాలుగో వ్యక్తే అన్నగారని సమాచారం. ఇక బీజేపీ కురవృద్ధుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎల్‌ కే అద్వాణీ, దళితుల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత కాన్షీరామ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి కూడా భారతరత్న ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా దళితులకు మరింత చేరువయ్యే అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. అలాగే ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్నతో సత్కరించుకోవడంతో పశ్చిమబెంగాల్‌లో ఆ పార్టీకి అనుకూలించే విషయం అని తెలుస్తోంది. 

English Title
Will Modi declare Bharat Ratna for NTR?

MORE FROM AUTHOR

RELATED ARTICLES