కలిస్తేనే కలిసుంటారా ?

x
Highlights

వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా? ప్రపంచంలోని మిగతా దేశాలలో జాతకాలను అంతగా పట్టించుకోవడం లేదు కదా. అక్కడ...

వివాహానికి వధూవరుల జాతకాలలో పొంతన అవసరమా? పెళ్లికి జాతకాలు తప్పనిసరిగా చూడాలా? ప్రపంచంలోని మిగతా దేశాలలో జాతకాలను అంతగా పట్టించుకోవడం లేదు కదా. అక్కడ పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా? మరి హిందూ ధర్మంలోనే ఇవన్నీ ఎందుకు? ఏయే జాతకాల అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు. ఎవరెవరికి వద్దని శాస్త్రం చెబుతోంది? వివాహం, గ్రహాలు, రాశులపై సైన్స్‌ ఏమంటోంది.? సిద్దిపేటలో జరిగిన జ్యోతిషుడి ఘటనతో వివాహాలు-వివాదాలపై ఓ చర్చ నడుస్తోంది.

మంచి జీవితానికి జ్యోతిష్యమే సరైన మార్గమంటారు పండితులు. మన మాటల్లో అపార్థం తావు లేకుండా ఉంటే కాపురంలో అన్యోన్యతకు స్థానం ఉందంటారు హేతువాదులు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే... సిద్దిపేట జిల్లాలో ఓ ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే... అత్తకో, మామకో గండం తప్పదని వరుడిని బెదరగొట్టాడంటూ వధువు తరుఫు బంధువులు సదరు జ్యోతిషుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. అయితే అమ్మాయి పేరు మీద బలం లేదని, పేరు మార్చుకోవాలని మాత్రమే తాను సూచించానని, బెదరగొట్టడమనే మాట అబద్ధమని చెబుతున్నాడతగాడు. అసలేంటి ఇదంతా.? నిజంగా వివాహం చేసుకోవాలంటే జాతకాలు చూసుకోవాల్సిందేనా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయిప్పుడు.

అందమైన జీవితం కావాలంటే జాతకాలు చూసుకోవాలి అంటున్నారు జ్యోతిషులు. వివాహానికి వధూవరుల జీవితాలలో పొంతన తప్పనిసరిగా కుదరాల్సిందేనంటున్నారు. జాతకాలు కలిస్తే వారు జీవితంలో కూడా కలసిమెలసి ఉంటారని చెబుతున్నారు. భూమి మీద ఉన్న మనుషులపై ఖగోళంలో ఉన్న గ్రహాల ప్రభావం ఉంటుందని శాస్త్రాలు, సైన్సు అంగీకరిస్తుంటే ఇంకా దీనిపై అభ్యంతరాలేంటని ప్రశ్నిస్తున్నారు. ఇతర దేశాల్లో వివాహాలు జరుగుతున్నా చిన్న వయసుల్లోనే విడాకులు, కలహాలు, మరణాలకు జాతక దోషాలే కారణమని స్పష్టం చేస్తున్నారు. గతంలో పన్నెండేళ్లు నిండకుండానే వివాహాలు చేసేవారు. ఈ ప్రక్రియ దోష రహితం కాబట్టి నక్షత్రాలు చూసేవారు కాదు. మఖ మామగారికి, జ్యేష్ఠ బావగారికి, ఆశ్లేష అత్తగారికి గండం అనేవారు. ఇప్పుడు పిల్లలకు 25 సంవత్సరాలు నిండిన తరవాత చేస్తున్నారు. అందువల్ల ఈ నక్షత్రాల ప్రస్తావన అనవసరం. నక్షత్రాలకు పరిష్కారం ఉంది, గ్రహాలకు లేదని చెబుతున్నారు పండితులు.

ముహుర్తాలు, జాతకాలు, గ్రహాలు, రాశులు చూసుకొని పెళ్లి చేసుకున్న వారిలో ఎంత మంది అన్యోన్యంగా ఉన్నారో చెప్పాలంటున్నారు హేతువాదులు. అలాంటివేవీ చూసుకోకుండా ప్రేమ వివాహాలు చేసుకున్న వారు.. దాదాపు అన్యోన్యంగా ఉంటున్న ఎంతోమందిని సమాజంలో చూస్తున్నామని చెబుతున్నారు. తల్లి గర్భంలో అండం- శుక్రకణాలు ఫలదీకరణ చెందినప్పుడే మనిషి జీవం మొదలవుతుంది. అదే అసలైన పుట్టుక. తల్లి గర్భం నుంచి బయటపడడం అనేది కొనసాగింపు మాత్రమే. కచ్చితమైన సమయాన్ని చెప్పలేం. అలాంటప్పుడు జాతకాలు రాయడానికి ఏది ఆధారమని ప్రశ్నిస్తున్నారు హేతువాదులు. ఇప్పుడు ఎక్కువ డెలివరీలు సిజేరియన్‌లే. అది కూడా ముహూర్తం పెట్టుకుని మరీ సిజేరియన్‌లు చేయించుకుంటున్నారు. అలా పుట్టిన బిడ్డ జాతకం కచ్చితంగా బాగుండి తీరాలి కదా! అలా జరుగుతోందా అనంటున్నారు. నవగ్రహాల ఆధారంగా జాతకాన్ని నిర్ణయిస్తారని జ్యోతిషులు చెబుతున్నప్పుడు సూర్యుడు గ్రహం కాదు, చంద్రుడు ఉపగ్రహం, రాహుకేతువులు నీడలు. నాలుగు పోగా మిగిలినవి ఎన్ని? మరి నవగ్రహాలనే మాటకు తావెక్కడ అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏమైనా మొత్తానికి జ్యోతిషం, సైన్స్‌ అంశంపై మరోసారి ప్రస్తావనకు వచ్చింది. రాశులు, గ్రహాలు గ్రహచారాలు, ఉపచారాలు... ఇవన్నీ సైన్స్‌తో మిలితమైన ఉన్నాయని జ్యోతిషులు.. అదంతా ట్రాష్‌ అంటూ హేతువాదులు... ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇంతకీ అసలు నిజం ఏంటి? సైన్స్‌ ఏమంటోంది.? శాస్త్రం ఏం చెబుతోంది.?

Show Full Article
Print Article
Next Story
More Stories