అగ్రరాజ్యాన్ని వదిలారు..ఉన్నత ఉద్యోగాలను కాదనుకున్నారు..ఏకంగా అడవినే నిర్మించారు..

అగ్రరాజ్యాన్ని వదిలారు..ఉన్నత ఉద్యోగాలను కాదనుకున్నారు..ఏకంగా అడవినే నిర్మించారు..
x
Highlights

నిజంగా ఈ ప్రకృతిని చూస్తుంటే ప్రణామం చెయ్యాలనిపిస్తుంది కదా...ఈ పచ్చని అడవులే ఆవాసంగా బతుకుతున్న జీవుల సందడిని వీక్షిస్తుంటే, ఎంత ప్రమోదంగా...

నిజంగా ఈ ప్రకృతిని చూస్తుంటే ప్రణామం చెయ్యాలనిపిస్తుంది కదా...ఈ పచ్చని అడవులే ఆవాసంగా బతుకుతున్న జీవుల సందడిని వీక్షిస్తుంటే, ఎంత ప్రమోదంగా అనిపిస్తుందో కదా...పచ్చని అడవులను చూస్తుంటే, ఎన్నెన్నో రాగాలు మదిలో మెదులుతాయి కదా. ఈ సృష్టి అడుగులో, అడుగేసి వెళ్లాల్సిన మనం, ఆ అడుగు గుర్తులను చెరిపేస్తున్నాం. దీని ఫలితం ఈ అందమైన ప్రకృతి అంతరించిపోవడం, కన్నులకు విందు చేస్తున్న ఈ పక్షి జాతి, జంతుజాతి, కనుమరుగైపోవడం, వాతావరణ మార్పులు, వర్షాభావం, చివరికి మనిషి వినాశనం. కానీ ఒక జంట ఈ వికృతిని తిరిగి ప్రకృతి చేయడానికి సంకల్పించింది. పచ్చదనాన్ని తిరిగి అడవికి ఇవ్వాలని ప్రతినబూనింది.

పొద్దున లేవగానే ట్రాఫిక్, హారన్ల మోత, జనవిస్ఫోటనం ఈ రణగొణ ప్రపంచం నుంచి దూరంగా పారిపోయి, ఎక్కడైనా ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది కదా. అయితే, కర్ణాటకలోని కొడగు అడవి ఒకటుంది. పచ్చని అడవిలో ఎన్నో రకాలు పక్షులంటాయి. జంతువులుంటాయి. ఏనుగు, ఎలుగబంటి, జింకలు, పులుల, ఇంకా దాదాపు 300 రకాల మూగజీవాలుంటాయి. వీటన్నింటిదీ ఒకటే కుటుంబం. ఒకటే ఇల్లు. ఈ అడవే వీరి పొదరిల్లు. కానీ ఈ పచ్చని అడవి నిర్మించింది, రక్షిస్తున్నది ఎవరో తెలుసా కుటుంబ పెద్దలు. ఈ కుటుంబ పెద్దలెవరో తెలుసా...ఇక్కడ కనిపిస్తున్నారే ఈ జంట.

ఇంతకూ ఈ అడవి బాట పట్టిన బాటసారులెవరో, వారి పేరేంటో, వారి నేపథ్యమెంటో, చెప్పలేదు కదా. ప్రపంచమంతా వీరిని వైల్డ్‌ లైఫ్‌ వారియర్స్‌ అని పిలుస్తోంది. ఎందుకంటే, ఎడారిలాంటి నేలను పచ్చదనంతో నింపారు. అడవిగా మలిచారు. మూగజీవాలకు ఆవాసంగా తీర్చిదిద్దారు. అందుకే వీరు వారియర్స్ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్. వీరి పేర్లు అనిల్ మల్హోత్రా, తమేలా మల్హోత్రా. దంపతులు. మొదట 50 ఎకరాల బంజరు భూమిని దత్తత తీసుకున్నారు. తర్వాత 250 ఎకరాలు. మొత్తం 300 ఎకరాల బంజరు భూమిని అడవిగా తీర్చిదిద్దారు. అందుకే ఇది ఇండియాలోనే తొలి ప్రైవేట్ వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి. పేరు సాయి వైల్డ్‌ లైఫ్‌ శాంక్చురి.

1989లో పమేలా, అనిల్‌ మల్హోత్రా అమెరికా నుంచి ఇండియాకు వచ్చారు. కేవలం చూడ్డానికి పర్యాటకుల్లా. కానీ అడవుల నరికివేత వీరిని కలచి వేసింది. ఏదో ఒకటి చేయాలని, అడవిని రక్షించుకోవాలని అప్పుడే సంకల్పించారు. మరుక్షణమే మొదలైంది వీరి సాహస ప్రయాణం.

ఐక్యరాజ్య సమితి సర్వే ప్రకారం, 1990 నుంచి 2015 వరకు 12 లక్షల 90 వేల చదరపు కిలోమీటర్ల అడవిని అభివృద్ది పేరుతో నరికివేశారు. అంటే ఇది మొత్తం భారతదేశం భూభాగంలో మూడోవంతు. ఈ భయానక పరిస్థితిని మార్చాలని సంకల్పించిన పమేలా దంపతులు, అమెరికాలోని సొంతస్థలాన్ని అమ్మేశారు. వారి కంఫర్టబుల్ లైఫ్‌స్టైల్‌ను వదిలేసి, ఇండియాకు వచ్చారు. బ్రహ్మగిరిలో వృధాగా పడిఉన్న భూమిని కొన్నారు. వీరి గురించి వింటుంటే, చాలా విచిత్రంగా అనిపిస్తోంది కదా. కానీ అనిల్ అండ్ పమేలా దృష్టిలో ఇది, మిషన్ పాయి. మూగజీవాల పరిరక్షణ దీని ఉద్దేశం. దీనిలో మొదటి అడుగు రిఫారెస్టేషన్.

అలా ఈ దంపతుల ప్రయత్నం మొదలైంది. పని మొదలుపెట్టారు. రకరకాల చెట్లు నాటారు. జంతువులు స్వేచ్చగా తిరిగే వాతావరణం కల్పించారు. ఎక్కడికక్కడ నీటి కుంటలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఫలితం కూడా కనిపిస్తోంది. దట్టమైన పచ్చని అడివి కనిపిస్తోంది. మొత్తం కొడగు జిల్లా నేలలో తడి ప్రారంభమైంది. కొడగు ఫారెస్ట్‌ చుట్టు పక్కల గ్రామాల్లో వర్షపాతం బాగా నమోదవుతోంది.

జనాభా పెరిగేకొద్దీ ప్రకృతి వినాశనం తప్పదని బాల్యం నుంచే పాఠాలు నేర్చుకుంటున్నాం. కానీ అనుసరించం. కానీ ఈ దంపతులు మాత్రం, ప్రకృతి కోసం వ్యక్తిగత ఇష్టాలను వదులుకున్నారు. పిల్లలను వద్దనుకున్నారు. పచ్చని ప్రకృతి, అందులో నివసించే మూగజీవాల పరిరక్షణకు నడుంకట్టారు. జీవవైవిధ్యం కోసం జీవితాన్నే అంకితమిచ్చారు. నిజంగా ప్రకృతి దంపతులు ఎందరికోఆదర్శం.

Show Full Article
Print Article
Next Story
More Stories