సంసారానికి ప‌నికి రాడ‌ని భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య

సంసారానికి ప‌నికి రాడ‌ని భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య
x
Highlights

దాంపత్య సుఖానికి పనికిరాడన్న కోపంతో తన భర్తను అతిదారుణంగా హతమార్చిందో భార్య. ఎలమంచిలిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను హత్యచేసి అది...

దాంపత్య సుఖానికి పనికిరాడన్న కోపంతో తన భర్తను అతిదారుణంగా హతమార్చిందో భార్య. ఎలమంచిలిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను హత్యచేసి అది సహజ మరణమని చిత్రీకరించే ప్రయత్నింలో ఆమె పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే.. యలమంచిలిలోని దిమిలి గ్రామానికి చెందిన అతికినశెట్టి నాగేశ్వరరావు (37) అనే వ్యక్తి కూరగాయాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతగాడికి 11ఏళ్ల క్రితం నర్సీపట్నంకు చెందిన వీరలక్ష్మి (27) అనే మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్లు వీరి సంసారం సాఫీగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. అయితే మూడేళ్లగా అనారోగ్య కారణాల వల్ల నాగేశ్వరరావు దాంపత్య జీవితానికి పనికిరాకుండా పోయాడు. ఈ కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో 27 ఏళ్ల వయసున్న ఈమెకు గూండ్రుబిల్లి గ్రామానికి చెందిన అవివాహితుడైన తారక ఈశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. విద్యుత్తు మీటర్ల రీడింగ్‌ తీసుకుని ఉపాధి పొందుతున్న ఇతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరికి తరచూ గొడవలు జరిగేవి. దీంతో వీరలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దలు నచ్చజెప్పి కొన్ని షరతులపై తిరిగి ఆమెను కాపురానికి రప్పించారు. ఈ మధ్యలో భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన నాగేశ్వరరావు మద్యానికి బానిసయ్యాడు.

సహజ మరణంగా నమ్మించబోయి...!
ఈ నేపథ్యంలో ఈనెల ఏడో తేదీ రాత్రి నాగేశ్వరరావు ఇంటిలో మంచంపై చనిపోయి ఉన్నాడు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు తాను బాత్‌రూమ్‌కి వెళ్లడానికి లేవగా ముక్కు నుంచి రక్తం వస్తూ మంచంపై పడిపోయి ఉన్నాడని స్థానికులను, ఆర్‌ఎంపీ వైద్యుడిని పిలిచి వీరలక్ష్మి చూపించింది. వారంతా అతను చనిపోయాడని చెప్పారు. అయితే మెడపై తాడుతో నొక్కిన గాయాలు ఉండటం వల్ల మృతుడి సోదరుడు రాము పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విచారణలో ఫోన్‌ నంబరు అడగ్గా, వీరలక్ష్మి తన అమ్మ నంబరు ఇవ్వడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. కాల్‌ డేటా సేకరించగా ఆరోజు రాత్రి 12 గంటల నుంచి 45 నిమిషాల పాటు గూండ్రుబిల్లిలో ఉన్న ప్రియుడు ఈశ్వరరావుతో మాట్లాడినట్లు తేలింది. శవపరీక్షల నివేదికలోనూ హత్యగా తేలింది. దీంతో వీరలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటపడ్డాయి.

భర్తను ఎలా చంపిందో డెమో చూపించి..
తన భర్తను ఎలా చంపిందో పోలీసులకు వీరలక్ష్మి తన ఇంటిలో డెమో చేసి చూపించింది. ఆమె చెప్పిన నిజాలను విన్న పోలీసులే షాకయ్యారు. నాగేశ్వరరావు హత్యకు వాడిన తాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్‌కాల్‌ డేటా, పోస్టుమార్టం రిపోర్ట్‌ల ఆధారంగా కేసును ఛేదించినట్టు పోలీసులు తెలిపారు. నిందితురాలు భర్తను ఎలా చంపింది ఆమె డెమో చేసి చూపించిన విజవల్స్‌ రికార్డు చేసి కోర్టుకి సమర్పించినట్లు సీఐ చెప్పారు. వీరలక్ష్మిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌ విధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories