యాత్ర ఆలస్యం కావడంతో అనేక కొత్త సమస్యలు

యాత్ర ఆలస్యం కావడంతో అనేక కొత్త సమస్యలు
x
Highlights

వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర ఎప్పుడు పూర్తవుతుందనే విషయం అంతుపట్టకుండా ఉంది. జగన్ యాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగకపోవడంతో నెలల తరబడి...

వైసీపీ అధినేత జగన్ చేపడుతున్న ప్రజాసంకల్పయాత్ర ఎప్పుడు పూర్తవుతుందనే విషయం అంతుపట్టకుండా ఉంది. జగన్ యాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగకపోవడంతో నెలల తరబడి ఆలస్యం అవుతోంది. కోర్టు కేసులు, పండుగ బ్రేక్‌లతో పాటు ప్రతికూల వాతావరణం కూడా జగన్ యాత్రకు ఆటంకాలుగా మారాయి. ప్రజా సంకల్ప యాత్ర ఆలస్యం కావడం ఆ పార్టీకి మేలు చేస్తుందా ? కీడు చేస్తుందా అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఇడుపుల పాయలో ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. జూలై 8న తూర్పుగోదావరి జిల్లాలో పూసలపూడిలో పర్యటన ద్వారా జగన్ 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారు. అలుపెరుగ కుండా యాత్రను కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారానికి గేట్ వే అయినటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్ ఎక్కువ దృష్టి సారించారు. గత నెల గోదావరి వంతెన దాటి రాజమండ్రిలో ప్రవేశించిన జగన్ ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నారు. 10 నియోజక వర్గాల్లో యాత్రను పూర్తిచేసుకున్నరు. మరో 9 నియోజక వర్గాల్లో యాత్రను పూర్తిచేయాల్సి ఉంది.

తూర్పు గోదావరి జిల్లాలో యాత్ర పూర్తయిన తర్వాత మరో మూడు జిల్లాలకు కూడా జగన్ కవర్ చేయాల్సి ఉంది. మొత్తంగా చూస్తే ఇంకా 500 కిలో మీటర్ల యాత్ర మిగిలే ఉంది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం రాత్రి వరకు పాదయాత్రకు బ్రేక్ పడడం, మధ్య మధ్యలో ప్రజాసంఘాల బంద్‌లు కారణంగా యాత్రకు బ్రేక్‌లు పడుతున్నాయి. దీని కారణంగా యాత్ర షెడ్యూల్ ప్రకారం కొనసాగడం లేదు. ఒక పక్క యాత్ర చేస్తూనే స్థానిక నేతలతో మంతనాలు చేయడం సమస్యలు పరిష్కరించడం వంటివి జగన్ చేస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో కూడా చర్చలు చేపడుతున్నారు. పార్టీలో ప్రతి అంశాన్ని తానే డీల్ చేస్తున్నారు.

జగన్ యాత్ర ఆలస్యం కావడంతో పార్టీలో అనేక కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా చాలా అభ్యర్ధులను ఖరారు చేయకపోవడం కూడా పార్టీ నేతల్లో కలవరం మొదలయింది. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వస్తే పార్టీ ఎలా సన్నద్ధం అవుతుందనే సందేహాలు కూడా పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. జగన్ వీలైనంత త్వరగా పాదయాత్రను ముగించుకుని పార్టీ అంతర్గత విషయాలపై మరింత దృష్టి సారిస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని లేకపోతే తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories