ప్రేమకు గుండెల్లోనే గుడి... దత్తపుత్రిక ప్రియురాలి కుమార్తె

ప్రేమకు గుండెల్లోనే గుడి... దత్తపుత్రిక ప్రియురాలి కుమార్తె
x
Highlights

అపర చాణక్యుడు, విపక్షాలు సైతం మెచ్చుకునే రాజకీయ వేత్త, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎందుకు పెళ్ళి చేసుకోలేదు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయారనేది...

అపర చాణక్యుడు, విపక్షాలు సైతం మెచ్చుకునే రాజకీయ వేత్త, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎందుకు పెళ్ళి చేసుకోలేదు. ఆయన ఆజన్మ బ్రహ్మచారిగా ఎందుకు ఉండిపోయారనేది చాలా మందికి తెలియదు. అయితే వాజ్‌పేయికి యుక్త వయస్సులో ఒక ప్రేమ కథ ఉందంటే ఎవరూ నమ్మరేమో. కానీ ఆయనది విఫల ప్రేమ.

అది 1942వ సంవత్సరం. గ్వాలియర్‌ విక్టోరియా కళాశాల. స్వతహాగా కవి, సాహిత్య ప్రియుడైన వాజ్‌పేయికి ప్రకృతి అంటే ఇష్టం. అందులోంచి పుట్టే కవిత్వమంటే మరీ ఇష్టం. ఆ రెంటినీ ప్రేమించే వారంటే ఇంకా ఇష్టం. అదే ఆయనను ప్రేమలో పడేట్లు చేసింది. వాజ్ పేయి క్లాస్‌మేట్ రాజ్ కుమారికి కూడా ఆయనలాగే ప్రకృతి, కవిత్వం అంటే చాలా ఇష్టం. భావాలు కలవడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వాజ్ పేయి, రాజ్‌కుమారి రోజూ కాలేజీలో కలుసుకునేవారు. లైబ్రరీకి కలిసి వెళ్ళేవారు. కానీ కలిసి తిరగడం ఏకాంతంగా గడపడం లాంటివి చేసేవారు కాదు. లైబ్రరీలోనూ, సెమినార్లలోనూ దూరం కూర్చుని కళ్లతోనే మాట్లాడుకునేవారు.

రాజ్‌కుమారిని జీవిత భాగస్వామిగా చేసుకుందామనుకున్న వాజ్‌పేయి ఓ ప్రేమలేఖను పుస్తకంలో పెట్టి దాన్ని ఆమెకు అందించారు. ఆమె నుంచి రెండు మూడు రోజులైనా ఏ స్పందనా లేకపోవడంతో తన లేఖను చూడలేదని వాజ్ పేయి అనుకున్నారు. కానీ రాజ్‌ కుమారి ఆ ప్రేమలేఖను చదివి సమాధానం రాసి అదే పుస్తకంలో పెట్టారు, కానీ ఆమెకు వాజ్‌పేయిని కలిసి ఇచ్చే వీలుకలగలేదు. అదే సమయంలో వాజ్ పేయి ఢిల్లీ వెళ్లారు. దీంతో రాజ్‌కుమారి రాసిన లేఖ వాజ్‌పేయిని చేరలేదు. పైగా రాజ్‌కుమారి వాజ్ పేయి మీదున్న ఇష్టాన్ని తన తల్లిదండ్రులకు చెప్పినా వారు ఒప్పుకోలేదు. ఇద్దరివీ బ్రాహ్మణ కుటుంబాలే అయినా శాఖ పరంగా, గోత్రంపరంగా తమది ఉన్నతమైన కుటుంబమని రాజ్‌కుమారి తల్లిదండ్రులు భావించి కూతురి ప్రేమను మొగ్గలోనే తుంచేశారు. తర్వాత రాజ్‌కుమారిని బ్రజ్‌ నారాయణ్‌ కౌల్‌ అనే కాలేజీ లెక్చరర్‌కిచ్చి పెళ్లి చేశారు. 1947లో ఢిల్లీలో హడావిడిగా నిశ్చితార్థం చేయించి, ఆ తరువాత గ్వాలియర్‌ తీసుకువచ్చి పెళ్లి చేశారు.

ప్రేమ విఫలమైన వాజ్‌పేయి పెళ్లి చేసుకోకుండా పూర్తిగా రాజకీయాలకు అంకితమైపోయారు. అయితే, కొన్నాళ్ల తర్వాత వాజ్‌పేయి ఢిల్లీలో రాజ్‌కుమారిని కలిశారు. ఆమె భర్త ఢిల్లీ వర్సిటీ పరిధిలోని రామజా కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్‌‌గా చేస్తున్న సమయంలో అక్కడ భార్యాభర్తలిద్దరినీ వాజ్‌పేయి కలిసేవారు. బ్రజ్‌ నారాయణ్‌ కౌల్‌తో వాజ్ పేయికి స్నేహం ఏర్పడటంతో వారింటికి తరచూ వెళ్లేవారు. అలా వారి మధ్య స్నేహ బంధం కొనసాగింది. ప్రొఫెసర్‌ కౌల్‌- రాజ్‌కుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు నమిత, నమ్రత. కొన్నాళ్లకు రాజకుమారి భర్త కౌల్‌ చనిపోయారు. ఆ తరువాత రాజ్‌కుమారి వాజ్‌పేయితోనే ఉండిపోయారు. ఆయన అధికార నివాసానికి మకాం మార్చారు.

రాజకుమారి వాజ్‌పేయి నివాసానికి వచ్చాక ఆమె కుమార్తె నమితను ఆయన దత్తత తీసుకున్నారు. నమిత, ఆమె కుమార్తె నీహారిక అంటే వాజ్‌పేయికి ప్రాణం. వాజ్‌పేయితో దశాబ్దాలపాటు స్నేహబంధం ఉన్నప్పటికీ రాజ్‌కుమారి ఎన్నడూ ఆయనతో బయట కనిపించలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజ్‌కుమారి 84 ఏళ్ళ వయసులో చనిపోయారు. ఆమె అంత్యక్రియలకు అద్వానీ సహా బీజేపీ అగ్రనేతలంతా హాజరయ్యారు.

ప్రియురాలు దక్కకపోయినా ప్రేమ కలకాలం నిలుస్తుందని నిరూపించిన వ్యక్తి వాజ్ పేయి. ప్రేమలో ఓడిపోవడం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. ఇష్టపడిన మహిళ కుటుంబాన్నే తన పరివారంగా మలచుకున్నారు. కానీ ఎన్నడూ తన ప్రేమ విషయాన్ని ఆయన గానీ, ఆయన ప్రేమించిన వ్యక్తిగానీ బయటకు చెప్పలేదు. వారి ఇష్టాన్ని గుండెల్లోనే దాచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories