లౌకిక తత్వాన్ని ఎవరు చెరిపేయగలరు?

లౌకిక తత్వాన్ని ఎవరు చెరిపేయగలరు?
x
Highlights

కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే లౌకికవాదం పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. రాజ్యాంగంలో లౌకికవాదం అన్న పదాన్ని తొలిగిస్తామంటూ...

కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే లౌకికవాదం పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించాయి. రాజ్యాంగంలో లౌకికవాదం అన్న పదాన్ని తొలిగిస్తామంటూ ఆయన చేసిన ప్రకటన యాదృచ్చికంగా చేసినట్టుగా కనిపించదు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకొంటూ పోతుండటం కాంగ్రెస్ ఉనికి నాలుగు రాష్ట్రాలకే పరిమితం కావడంతో బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నదా అన్న అనుమానం కలుగకపోదు. మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం సాధిస్తుండటంతో బీజేపీ తన అజెండాను నెమ్మదిగా అమలు చేసేందుకు అడుగులు కదుపుతున్నట్టు అర్థమవుతున్నది. ట్రిపుల్ తలాఖ్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, అయోధ్య కేసును పరిష్కారం దిశగా కదిలించడం వంటి చర్యలు ఒక్కటొక్కటిగా తన సైద్ధాంతిక మార్గాన్ని అనుసరిస్తున్న తీరును తెలియజేస్తున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మినహా, ఆ పార్టీలోని అతివాద నేతలు తరచూ రకరకాలైన ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ ఈ అతివాదం పెరిగిపోతున్నది. ఇప్పుడు అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి కారణమైనాయి. కర్ణాటకలోని ఒక కుల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ స్వభావాన్ని ప్రశ్నించేవిధంగా ఉన్నాయి.

మన దేశంలో ఈ పరిస్థితి మొదట్నుంచీ మొదట్నుంచీ ఉన్నదే. పాలక వర్గం తనకు అనుకూలంగా కులాలను, మతాలను, వర్గాలను వాడుకుంటూ దేశంలో ప్రజల మధ్య ఇంటిగ్రిటీ అన్నది లేకుండా చేస్తూ వస్తున్నది. దేశ విభజన సమయంలో హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. షాబానో కేసు విషయంలో రాజీవ్ గాంధీ ఏకంగా రాజ్యాంగ సవరణనే చేపట్టి మైనార్టీ ఓటు బ్యాంకుకోసం తాపత్రయపడ్డారు. అయోధ్యను అస్త్రంగా వాడుకొన్న అద్వానీ మెజార్టీ ఓటుబ్యాంకుతో రెండు సీట్ల బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి నిలబెట్టారు. వామపక్షాలు దళితులు, కార్మిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాయి. మాయావతికి దళితులు కావాలి తమిళ రాజకీయాలకు జాతి రాజకీయాలు కావాలి. భారత రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే ఒక్కోసారి ఈ దేశం ఎవరిదన్న అనుమానం కలుగుతుంది.

నిజానికి మన రాజ్యాంగ స్వభావం స్వరూపం అత్యంత విశాల దృక్పథమున్నది. లౌకికమన్న పదం 1975 ఎమర్జెన్సీ తరువాత రాజ్యాంగం ముఖపత్రంలో చేరినప్పటికీ. తొలి నుంచీ రాజ్యాంగం విస్తృతంగా కులమతాలను గౌరవించే రీతిలో రూపొందిందే తప్ప తిరస్కరించేవిధంగా లేదు. ప్రపంచంలో మరే దేశానికీ లేని విభిన్నమైన జాతీయత ఈ దేశానికుంది. ఒక భాష కాదు, ఒక సంస్కతి కాదు, ఒక పండుగ కాదు, ఒక మతం కాదు, ఒక వేషం కాదు.. ఇన్ని వైరుధ్యాలు ఉన్నా అన్నింటినీ కలిపే సన్నని దారం ఏదో అంతర్లీనంగా ఉన్నదని పెద్దల మాట. దానికే వారు పెట్టిన పేరు భిన్నత్వంలో ఏకత్వం. ఎవరికి వారు వారి వారి మతాభిప్రాయాలను గౌరవించుకున్నా, భారతీయ సమాజం అంతా ఒకటేనని మనం ఎప్పుడూ చెప్పుకునే మాట. ఎందుకంటే మన పూర్వీకులు అంతా ఆసేతు హిమాచలాన్ని ఒకటిగానే భావించారు. జంబూద్వీపే, భరత వర్షే, భరత ఖండే అని నిత్యం దేవతార్చనల్లో వినిపించే పవిత్ర మంత్రం. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రాముడు స్వయంగా అన్న మాట. ఒక్క రామాయణమే కాదు.. భారతాది ఇతిహాసాలు. ఇతర సాహిత్యము, ఇక్కడి పర్యాటక క్షేత్రాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, నదులు, పర్వతాలు భారత ప్రజలందరినీ ఏకం చేశాయి. రాజకీయంగా దేశంలో వందలాది రాజ్యాలు ఉండేవి.. అయినా సాంస్కతికంగా ఉన్న ఐక్యత దేశాన్ని ఏకతాటిపై ముందుకు నడిపించింది. స్వాతంత్య్రానికి ముందు కానీ, ఆ తరువాత కానీ, ఈ దేశంలో పుట్టిన విప్లవ, సాంస్కతిక, సంస్కరణ ఉద్యమాలన్నీ ఈ పునాదులపైనే దేశమంతటా విస్తరించాయి.

రాజా రామ్మోహన్‌రాయ్‌, దయానంద సరస్వతి, రామకష్ణ పరమహంస, ఆరవిందులు, వీరేశలింగం పంతులు వంటి వారు అనేకులు ఈ పునాదులపైనే ఆధారపడి ఉద్యమాలను నడిపారు. వీరికి మత, ప్రాంత, భాషా వేషాలతో పని లేదు. భారతీయ సమాజాన్నంతా ఒకటిగానే సంభావించారు. ప్రపంచంలో ఇతర దేశాల వాళ్లు దేశం అంటే కేవలం జియోగ్రాఫికల్‌గానే చూస్తారు. కానీ, మన పెద్దలు ఈ దేశాన్ని మాతృమూర్తిగా ఆరాధించారు. మైదానాలు, అడవులు, కొండలు, నదులు కలగలిసిన సమస్త ప్రకృతిని దేశంలో భాగంగా చూశారు. జాతి అంటే కోట్ల ప్రజల సమష్టి శక్తి అని అరవిందులు అంటారు. ఈ శక్తి ఇప్పుడు మరుగునపడిపోయింది. మూలాలు భూగర్భంలోకి చొచ్చుకుపోయాయి. వీటిని సంపూర్ణ శక్తితో తిరిగి వెలుగులోకి తీసుకురావటానికి అప్పుడప్పుడూ ఎవరో ఒకరి ద్వారా ప్రయత్నం జరుగుతున్నా.. అది పూర్తిగా సఫలం మాత్రం కావటం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి.

మన స్వాతంత్య్రం సప్తతి పూర్తి చేసుకుని కూడా ఏడాది గడిచిపోయింది. దేశంలో రాష్ట్రాల సంఖ్య 29కి చేరుకున్నది. 23 భాషలను అధికారికంగా గుర్తించారు. దాదాపు వెయ్యి మాండలికాలు వాడుకలో ఉన్నాయి. లిపి లేని మౌఖిక భాషలు లెక్కే లేదు. శైవ, వైష్ణవ, శాక్తేయ, సిక్కు, బౌద్ధ, జైన, ఇస్లాం, క్రైస్తవం లాంటి మతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఇక్కడ సహజంగా పుట్టినవి.. మరికొన్ని రకరకాల మార్గాల్లో ఇక్కడికి వలసవచ్చి విస్తరించినవి ఈ దేశ సంస్కతిలో అంతర్భాగంగా చేరిపోయినవి. ఇక జాతులు, ఉపజాతులు కులాలు, ఉప కులాల సంఖ్య చెప్పనే అక్కర్లేదు. వాటి మధ్య జీవన వైరుధ్యం, సాంస్కృతిక వైరుధ్యం, సంప్రదాయ వైరుధ్యం ఎంతో ఉంది. ఇక్కడ వృత్తులు ఆ తరువాతి క్రమ పరిణామంలో కులాలుగా మారాయి. ఎవరి బాధ్యతలూ వారు సమానంగా నిర్వహించటం వల్ల ప్రజానీకం సమైక్యంగా ఉండగలిగింది. ఇక్కడ మత, కుల వైరుధ్యాలు, ఆచార వ్యవహారాలు అడ్డం రాలేదు. కానీ ఇప్పుడు మన రాజకీయ నాయకుల పుణ్యమా అని, వారి సంతృప్తీకరణ విధానాల వల్ల దేశంలో ద్విజాతి సిద్ధాంతం కొనసాగే పరిస్థితి నెలకొన్నది.

అయితే మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం, లౌకికవాదం, గణతంత్రం మొదలైన విలువలకు సార్వజనీన ఆమోదం సాధించింది. కాబట్టి రాజకీయ పార్టీలు ఎన్ని సంతృప్తికరణ విధానాలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం అనుసరించినా అవి సంపూర్ణ భారతీయ లౌకికవాదానికి విఘాతం కల్గించలేకపోతున్నవి. లౌకికవాదమంటే అన్ని మతాలను దూరం పెట్టడం (మత రహితం) అనే అభిప్రాయం కూడా కొందరికి ఉన్నది. కానీ పాశ్చాత్య భావనలకు భిన్నంగా మన దేశంలో మన సాంస్కృతిక విలువలకు అనుగుణంగా- అన్ని మతాలకు సమానంగా గౌరవం ఇవ్వాలనే అభిప్రాయం నాటి రాజ్యాంగ నిర్మాతలకు ఉన్నది. అందువల్ల లౌకికవాదమనే పదంతో నిమిత్తం లేకుండానే రాజ్యాంగాన్ని తదనుగుణంగా రూపొందించారు. ఆనాడే మత స్వాతంత్య్రాన్ని, బహుళత్వాన్ని గుర్తించారు. ఏడు దశాబ్దాల ప్రస్థానంలో భారతీయ సమాజం లౌకికవాదాన్ని తనదైన అర్థంలో నిర్వచించుకున్నది. ఆ లౌకికవాదమే రాజ్యాంగంలో, ఆచరణలో సాక్షాత్కరిస్తున్నది. ఈ లౌకికతత్వాన్ని తొలిగించడం ఎవరి వల్లా కాదు.

Show Full Article
Print Article
Next Story
More Stories