లోక్‌‌సభలో మండే టెన్షన్..కాకపుట్టిస్తున్న అవిశ్వాస అస్త్రం

లోక్‌‌సభలో మండే టెన్షన్..కాకపుట్టిస్తున్న అవిశ్వాస అస్త్రం
x
Highlights

కేంద్రంపై ఏపీలోని అధికార , టీడీపీ, విపక్ష వైసీపీ సంధించిన అవి‌‌శ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. సోమవారం మరోసారి లోక్‌సభ ముందుకు...

కేంద్రంపై ఏపీలోని అధికార , టీడీపీ, విపక్ష వైసీపీ సంధించిన అవి‌‌శ్వాస అస్త్రం దేశ రాజకీయాల్లో సెగలు రేపుతోంది. సోమవారం మరోసారి లోక్‌సభ ముందుకు అవి‌శ్వాస తీర్మానం రానుండడంతో కాకపుట్టిస్తోంది. దీంతో సోమవారం సభలో ఏం జరుగుతుందనే టెన్షన్ మొదలైంది. అవిశ్వాసాన్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటారా..? ఆ రోజైనా సభ ఆర్డర్‌లో ఉంటుందా..? అదే రోజు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ జరుగుతుందా..? మోడీ సర్కారుపై పెట్టిన అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందా..? అవిశ్వాసానికి కలిసొచ్చే కొత్త పార్టీలు ఏవనే చర్చ వాడివేడిగా జరుగుతోంది.

అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ, వైసీపీకి 23 మంది ఎంపీలున్నారు. ఇక కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్షాలు, సమాజ్‌వాదీ, డీఎంకే, జేడీఎస్‌, ఆర్జేడీ, ఎన్సీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, నేషనల్ కాన్ఫరెన్స్, జేఎంఎం, ముస్లింలీగ్ వంటి పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ప్రస్తుతం అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారి సంఖ్య 150 దాటింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో సానుభూతి ప్రకటిస్తున్న పార్టీల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో బీజేపీ వ్యతిరేక బలం పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కేంద్రంపై మొదటి నుంచి అసంతృప్త రాగం వినిపిస్తున్న శివసేనకు 18 మంది ఎంపీల బలముంది. ఆ పార్టీ అవిశ్వాసానికి మద్దతిస్తుందా లేదా అనేది ఇంకా తేలలేదు. అందుకే శివసేనతో ఢిల్లీ పెద్దలు రాజీ యత్నాలు చేస్తున్నారు. అలాగే 20 మంది ఎంపీలున్న బిజూ జనతాదళ్ కూడా ఎలాంటి అభిప్రాయమూ ప్రకటించలేదు.

ఇక కొద్ది రోజుల కిందటే..థర్డ్ ఫ్రంట్ రాగం మొదలు పెట్టిన టీఆర్ఎస్‌ కూడా అవిశ్వాసంపై తుది వైఖరి ప్రకటించలేదు. గులాబీ పార్టీకి మొత్తం 14 మంది ఎంపీల బలముంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే మోడీ సర్కరునై నిప్పులు చెరుగుతుండడం ప్రత్యేక హోదా విషయంలో అండగా ఉంటామని లోక్‌సభ సాక్షిగా ఎంపీ కవిత ప్రకటించడం తెలంగాణకు సంబంధించిన విభజన హామీల అమలులో ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో టీఆర్ఎస్‌ అసంతృప్తితో ఉండడం వంటివి ఆ పార్టీ కూడా మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తుందని భావిస్తున్నారు.

అవిశ్వాసానికి మద్దతు కూడగడుతూనే సభలో ఓటింగ్ జరిగేలా ఏసీ సీఎం ప్రణాళికలు వేస్తున్నారు. టీడీపీ ఎంపీలు, కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్
నిర్వహించిన టీడీపీ అధినేత లోక్‌సభలో

అవిశ్వాసంపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని డివిజన్ అడగాలని ఆదేశించారు. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే బాధ్యతను ఆరుగురు సభ్యుల టీడీపీ ఎంపీల బృందానికి అప్పగించారు. ఇవాళ, రేపు ఢిల్లీలో ఉండి అవి‌శ్వాసానికి మద్దతు కోసం అన్ని పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలవాలని చెప్పారు.

అయితే అవిశ్వాసం వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్దగా ప్రమాదం లేకపోయినా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావడం కమలనాథుల్లో కలవరం రేపుతోంది. అసలే గోరఖ్ పూర్, ఫూల్ ఫూర్ పార్లమెంటరీ స్థానాల్లో ఘోర పరాజయంతో ఇబ్బందికర పరిస్థుల్లో ఉన్న కమల దళానికి తాజా పరిణమాలు పుండుమీద కారం చల్లినట్లయ్యింది. ప్రస్తుతం లోక్‌సభలో స్పీకర్‌ను మినహాయిస్తే ఎంపీల సంఖ్య 539గా ఉంది. ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం అవిశ్వాపం గట్టెక్కడానికి కావలసిప మెజార్టీ మార్క్ 271. ప్రస్తుతం బీజేపీకే 274 మంది ఎంపీల బలముంది. ఇక అకాళీదళ్, లోక్‌ జనశక్తి, RLSP , JDU , అప్నాదళ్ వంటి ఎన్డీఏ పక్షాలతో కలిసి కేంద్ర సర్కారుకి 293 మంది బలముంది. అన్నాడీఎంకే కూడా అవి‌శ్వాసానికి దూరంగా ఉంటామని ప్రకటించడం అధికార పార్టీకి ఊరట.

మోడీకి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది బీజేపీ ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతిస్తామని ముందకొచ్చారంటూ టీడీపీ నేతలు చెప్పడం ఈ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్. మొత్తంగా అనూహ్య పరిణామాల మధ్య ఏపీ పార్టీలు కేంద్రంపై ఎక్కు పెట్టిన అవిశ్వాస బాణం కమలనాథుల గుండెల్లో గుబులు రేపుతోంది. సోమవారం నాటికి పరిణామాలు ఎలా మారతాయోననే టెన్షన్ బీజేపీ నేతల్లో పట్టుకుంది. దీంతో అవిశ్వాసాన్ని ఎదుర్కొనే వ్యూహాలకు బీజేపీ పదును పెడుతున్నారు. అన్నాడీఎంకే, జేడీయూ ఎంపీలను రంగంలోకి దించి సోమవారం సభను అడ్డుకోవడం ద్వారా అవిశ్వాస నోటీసుల్ని స్పీకర్ పరిగణనలోకి తీసుకోకుండా పథకం వేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories