logo

కుకట్ పల్లిలో నందమూరి సుహాసిని గెలుస్తారా...సుహాసినిని నిలబెట్టడంలో చంద్రబాబుకు ప్రత్యేక వ్యూహముందా?

తెలంగాణలో పార్టీని బతికించుకోడానికి కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సెటిలర్ల ఓట్లను అందుకు ఆయుధంగా వాడుకుంటున్నారు. తన వ్యూహానికి మరింత బలం చేకూర్చడానికి నందమూరి ఫ్యామిలీకి టిక్కెట్ ఇచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చారా?

మహాకూటమి కూకట్ పల్లి అభ్యర్ధిగా నందమూరి సుహాసిని రంగంలోకి దిగడంపై రాజకీయ వర్గాల్లో భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో కొంత కాలంగా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న టిడిపి పార్టీని బతికించుకోడానికి చివరకు కాంగ్రెస్ తో జత కట్టింది. మహా కూటమి పేరుతో ఎన్నికల బరిలోకి దిగింది. తెలుగు దేశం పార్టీకి తెలంగాణ గడ్డపై లీడర్ లేకపోయినా బలమైన కేడర్ ఉంది. ఆ కేడర్ ను కాపాడుకుంటూ కొన్నైనా సీట్లు సాధించాలన్న పట్టుదలతో చంద్రబాబు పంతాలకు పోకుండా కాంగ్రెస్ ఇచ్చినన్ని సీట్లతో సంతృప్తి పడ్డారు. ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు హైదరాబాద్ ను అభివృద్ధి చేసినది తానేనని టైమ్ దొరికినప్పుడల్లా చెబుతూ సెటిలర్ల చూపు టిడిపివైపు ఉండేలా జాగ్రత్త పడుతూ వచ్చారు. హైదరాబాద్ లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయడంలో సెటిలర్ల పాత్ర కీలకమైనది వారి ఓట్లన్నీ టిడిపికే దక్కాలన్న వ్యూహంతోనే నగరంలో సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కాంగ్రెస్ తో పట్టుబట్టి మరీ చంద్రబాబు టిడిపికి టిక్కెట్లు కేటాయించుకున్నారు. ఇక్కడి వరకూ అంతా బానే ఉంది ఇక్కడే చంద్రబాబు తన రాజకీయ చతురతకు పదును పెట్టారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తెలంగాణలో హరికృష్ణ కుటుంబానికున్న మంచి పేరు, సానుభూతిని సొమ్ము చేసుకునేలా, ఏపీలో తన పార్టీ వారసత్వానికి భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకి లేకుండా బ్రహ్మాండమైన స్కెచ్ ను చంద్రబాబు రచించారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కుకట్ పల్లి మహా కూటమి అభ్యర్ధిగా నందమూరి సుహాసినిని రంగంలోకి దింపడం ద్వారా జూనియర్ ఫ్యామిలీకి చంద్రబాబు ఒక సరిహద్దు రేఖను గీశారన్నది ఆ వర్గాల టాక్ హరికృష్ణతో తనకు సత్సంబంధాలున్నాయని ప్రూవ్ చేసుకునేందుకు,సెటిలర్ల ఓట్లను కొల్ల గొట్టడానికే సుహాసినిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు తెలుగు దేశం భవిష్య సారధిగా జూనియర్ పగ్గాలు ఆశించకుండా ఉండటానికి ఇదో సుతిమెత్తని ఇండికేషన్ అన్నది ఆ వర్గాల భావన జూనియర్, కల్యాణ్ రామ్ ల కుటుంబానికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా వారిని తెలంగాణకు పరిమితం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం నెరవేరిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ అంచనా తప్పయితే చంద్రబాబు హరికృష్ణ సొంతూరు అయిన నిమ్మకూరులో ఈ కుటుంబానికి టిక్కెట్ కేటాయించి ఉండొచ్చనీ అలా చేయకపోవడం వెనక జూనియర్ కుటుంబాన్ని పథకం ప్రకారమే హద్దుల్లో ఉంచారనీ రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రాజకీయ నిపుణుల ఉద్దేశాలెలా ఉన్నా అక్క సుహాసిని నామినేషన్ సందర్భంగా అన్నదమ్ములు ఆమెకు ఒక పత్రికా ప్రకటనతో మద్దతు సరిపెట్టడం ఈ విశ్లేషణకు బలం చేకూరుస్తోంది. ఆడవారికి సమాన అవకాశాలిచ్చి ప్రోత్సహించడంలో తెలుగుదేశం ఎప్పుడూ ముందుంటుందని తాత, తండ్రులను కీర్తిస్తూ సోదరి సుహాసినికి శుభాకాంక్షలు చెప్పారు హరికృష్ణ కుమారులు సందేశం చివరన జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ అని మాత్రమే సంబోధించడం, ఎక్కడా జై తెలుగు దేశం అని గానీ, జై చంద్రబాబు అని గాని చెప్పకపోవడం చూస్తుంటే చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ల సంబంధాల మధ్య ఏదో పైకి కనపడని అంతరం ఉందన్న విషయం మాత్రం అర్ధమవుతోంది. తెలుగు దేశాన్ని సీమాంధ్రుల పార్టీగా ముద్రించి.. తరిమి కొట్టాలని చూస్తున్న టిఆరెస్ ప్రచారాన్ని ఎదురొడ్డి సుహాసిని గెలుపు సొంతం చేసుకోగలరా? వరస చూస్తుంటే కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ప్రచారానికి వచ్చే దాఖలాలు కనిపించడం లేదు ప్రస్తుతానికి బాబాయ్ బాలయ్య, ఇతర కుటుంబ సభ్యులు, మరిది లోకేష్ మాత్రమే సుహాసిని తరపున ప్రచారానికి రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ పుట్టిన గడ్డపై సుహాసినిని గెలిపించాలంటూ లోకేష్ ఇప్పటికే ట్వీట్లతో ప్రచారం మొదలు పెట్టేశారు.

లైవ్ టీవి

Share it
Top