ఇందూరులో బ్యాలెట్ పోరు...ఒత్తిళ్లు తట్టుకుని నిలబడిన అన్నదాతలు...

ఇందూరులో బ్యాలెట్ పోరు...ఒత్తిళ్లు తట్టుకుని నిలబడిన అన్నదాతలు...
x
Highlights

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో నిజామాబాద్ పేరు మార్మోగుతోంది. ఈవీఎంల యుగంలో బ్యాలెట్ పోరకు ఇక్కడి రైతుల తెరలేపారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులను...

దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో నిజామాబాద్ పేరు మార్మోగుతోంది. ఈవీఎంల యుగంలో బ్యాలెట్ పోరకు ఇక్కడి రైతుల తెరలేపారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులను కాదని తమకు తామే పెద్ద సంఖ్యలో ఎన్నికల శంఖారావం పూరించారు. గెలుపు కోసం కాదు రైతు సంక్షేమం కోసం నినాదంతో గడపగడపకు ప్రచారం చేపట్టారు.

ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిజామాబాద్ రైతులు తాము అనుకున్నదే సాధించారు. ఎన్నికల్లో పాల్గొని ప్రధాన పార్టీల కలలు కల్లలు చేస్తామంటూ చెప్పిన మాటను నిజం చేస్తూ పెద్ద సంఖ్యలో బరిలోకి దిగారు. దీంతో ఈవీఎంలు అమల్లోకి వచ్చాక నిజామాబాద్ లో తొలిసారిగా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్దిగా కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్దిగా ధర్మపురి అర్వింద్, కాంగ్రెస్ అభ్యర్దిగా మధుయాష్కీ ప్రధాన పార్టీ అభ్యర్దులుగా ఉండగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జనసేన, పిరమిడ్, బహుజన్ ముక్తి, సమాజ్ వాది ఫార్మర్డ్ బ్లాక్ నాలుగు పార్టీల నుంచి నలుగురు అభ్యర్దులు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ ఏడుగురు అభ్యర్దులను మినహాయిస్తే మిగిలిన 178 మంది నియోజకవర్గంలోని ఎర్రజొన్న, పసుపు రైతులే ఉన్నారు

బ్యాలెట్ పద్దతిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడే ఎన్నికల అధికారులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. 178 మంది అభ్యర్ధులకు ముందుగా గుర్తులు కేటాయించాలి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం స్వతంత్రులుగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధులకు ముందుగానే గుర్తులు అందజేస్తారు. వాటిల్లో నుంచి ఒక్కో అభ్యర్ధి ఒక్కో గుర్తును ఎంచుకోవాలి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాత తాను కోరుకున్న గుర్తు ఈసీకి తెలియజేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఈవీఎంలపై అభ్యర్ధుల పేర్లు, గుర్తులను ఉంచుతారు. ఇక్కడ అభ్యర్ధులు ఎక్కువ ఉండటంతో బ్యాలెట్‌పై గుర్తులతో పాటు అభ్యర్ధుల వివరాలు ముద్రించాల్సి ఉంటుంది. మొత్తం 185 మంది అభ్యర్ధులు ఉండటంతో ఓ భారీ సైజు దినపత్రిక స్ధాయిలో బ్యాలెట్ పేపర్ ఉండే అవకాశముంది. ఇదే సమయంలో పోలింగ్‌కు వారం ముందు అభ్యర్ధి క్రమ సంఖ్య, గుర్తు వివరాలు తెలియజేయాలి. ఈలెక్కన ఈసీకి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

బ్యాలెట్ పోరుతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇక్కడి రైతులు గెలుపే లక్ష్యంగా తమ పోరాటం సాగుతోందని చెబుతున్నారు. అతి తక్కువ సమయంలో బ్యాలెట్ పేపర్ పద్దతిలో ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఇదే సమయంలో పోటీలో ఉన్న రైతుల తదుపరి కార్యాచరణపై కూడా ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న ఎవరికి మద్ధతిస్తారనేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories