ఏపీలో పిడుగుల బీభత్సం.. నేడు, రేపు వర్షాలు..

ఏపీలో పిడుగుల బీభత్సం.. నేడు, రేపు వర్షాలు..
x
Highlights

ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, భూమధ్య రేఖపై హిందూ మహా సముద్రానికి ఆనుకుని దక్షిణ...

ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి, భూమధ్య రేఖపై హిందూ మహా సముద్రానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో మరో ద్రోణి.. అలాగే కర్ణాటక పరిసరాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు చాలా మంది మృతిచెందారు. అనేకచోట్ల పశువులూ బలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో పిడుగుపాటుతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, చెట్టు కూలి మరొకరు ప్రాణం విడిచారు. అలాగే పలుచోట్ల పశువులు ప్రాణాలు విడిచాయి. ప్రకాశం జిల్లాలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

దర్శి మండలం ఎర్రఓబయనపల్లిలో ఏడెకరాల బొప్పాయి తోట నేలమట్టమైంది. అలాగే, కొనకమిట్ల మండలం పెదారికట్లలో వడగండ్ల వాన పడింది. పొదిలి మండలం మల్లవరం గ్రామంలో పిడుగుపాటుకు కోతి మృతిచెందింది. కడప జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లెలో పిడుగుపాటుకు ఐదు గొర్రెలు, మూడు మేకలు మృత్యువాతపడ్డాయి. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో తన పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపడడంతో సత్యాల చిన్నయ్య (46) అనే వ్యక్తి షాక్‌కు గురై మృతిచెందాడు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కృష్ణరాయపురంలో పిడుగుపాటుకు ఈశ్వరరావు (35) మరణించాడు. ఇక ఆది, సోమవారాల్లో కూడా కోస్తాంధ్ర, రాయలసీమల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని ఐఎండీ వెల్లడించింది. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories