ఆరోగ్యం కోసం ఆహారం

ఆరోగ్యం కోసం ఆహారం
x
Highlights

ఆరోగ్యం గా ఉండడమంటే ఆనందంగా ఉండటమే.. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు కచ్చితంగా ఆనందంగా ఉంటారంటారు. నిజమే కదా! ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే...


ఆరోగ్యం గా ఉండడమంటే ఆనందంగా ఉండటమే.. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు కచ్చితంగా ఆనందంగా ఉంటారంటారు. నిజమే కదా! ఆరోగ్యంగా ఉండటం కోసం మనం చేసే ప్రయత్నాలు ఎన్నో. కానీ, ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా 90 శాతం అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని వైద్యులు చెబుతారు. మనం మాత్రం మనకి నచ్చినవి మాత్రమే తిని ఉరుకుంటాం. సాధారణంగా మనకు నచ్చే ఆహారపదార్థాలతో పాటు నచ్చినా.. నచ్చకపోయినా కొన్నిటిని కచ్చితంగా తీసుకోవడం ద్వారా చలాకీగా.. చురుగ్గా ఉండొచ్చు.. ఇపుడు అవేంటో చూద్దాము.

ఓట్స్..

ఓట్స్ గురించి ఇపుడిపుడే మనలో చాలా మందికి అవగాహన కలుగుతోంది. ఓట్స్ ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. దీనిలో కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించే బీటా గ్లూటెన్ అనే ఓ రకమైన కరిగిపోయే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నివారించడంలో సహాయపడుతుంది.

రోజూ ఒక కప్పు ఉడికించిన ఓట్ బ్రాన్ లేదా కప్పున్నర ఓట్ మీల్ ను తినడం వల్ల లభించే బీటా గ్లూటెన్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను 5 శాతం మేర తగ్గిస్తుంది. అంతేకాదు హార్ట్ ఎటాక్ ముప్పును 10 శాతం తగ్గిస్తుంది.

జీర్ణకోశ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరిగేందుకు ఓట్స్ లో ఉండే బీటా గ్లూటెన్ పనిచేస్తుంది. అధిక బరువు ఉన్న వారికి ఓట్ మీల్ తో ఉన్న మరో ప్రయోజనం ఆ బరువును సులభంగా తగ్గించుకోవడమే.

ఓట్స్ ను ఎక్కువ మంది ఉదయం పాలు లేదా నీటిలో ఉడికించి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఈ విధంగా నెలరోజులు చేసి బరువు చూసుకుంటే తేడా మనకే తెలిసిపోతుంది.

వెల్లుల్లి

చాలా మంది వెల్లుల్లిని చూడగానే మొహం అదోలా పెట్టేసుకుంటారు. అయితే, వేల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైద్యులందరూ దీనిని ఒప్పుకున్నారు. వెల్లుల్లిలో బ్యాక్టీరియా వ్యతిరేక, ఫంగల్ వ్యతిరేక గుణాలున్నాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కాంపౌండ్లకు వ్యాధులపై పోరాడే మంచి శక్తి ఉంది. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వీటిలో ఎక్కువ ప్రయోజనాలు గుండెను కాపాడేందుకు ఉపయోగపడేవే. వారంలో కనీసం ఆరు వెల్లుల్లి రెబ్బలను తినే వారిలో చెడు కొలెస్ట్రాల్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. కడుపు, ప్రొస్టేట్ కేన్సర్ ముప్పులను కూడా తగ్గిస్తుంది. ప్రతి రోజూ కనీసం ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకోవాలన్నది ప్రమాణం. తినడానికి ముందు వెల్లుల్లి రెబ్బల పొట్టును తొలగించి వాటిని ముక్కలుగా కోసి ఓ పది నిమిషాల పాటు అలా ఉంచేయాలి. దీనివల్ల అందులో ఉండే వ్యాధి నిరోధక గుణాలు విడుదల అవుతాయి.

పెరుగు

మనలో చాలామంది పెరుగుతో కొలెస్ట్రాల్ పెరుగుతుందని పక్కకు జరిపెస్తారు. కానీ, పెరుగులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ అనే బ్యాక్టీరియా నిజంగా ఎంతో మేలు చేస్తుంది. పేగుల్లో హానికారక బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా ఉండాలంటే పెరుగు తినాలి. పెరుగును ఎక్కువగా తీసుకుంటే ఇన్ఫ్లమ్మేటరీ బవెల్ వ్యాధి(ఆహారం తీసుకున్నప్పుడల్లా విరేచనానికి వెళ్లాల్సి వస్తుంది) తగ్గించుకోవచ్చు. అలాగే, అల్సర్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, జననేంద్రియ భాగాల్లో వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలోనూ పెరుగు పాత్ర ఎంతో. 175 గ్రాముల తక్కువ ఫ్యాట్ ఉండే పెరుగును రోజులో తీసుకోవడం వల్ల పైన చెప్పుకున్న ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు.

ఆలివ్ ఆయిల్

చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) ను తగ్గించడం, మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డీఎల్) ను పెంచడం ఆలివ్ ఆయిల్ తో సాధ్యం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు రావు. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందుకు వీలు కల్పిస్తాయి. ఇంకా ఆలివ్ ఆయిల్ లో ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ధమని గోడల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధిస్తాయి. ప్రతి రోజూ ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను భోజనంలో భాగం చేసుకుంటే చాలు. ఆలివ్ ఆయిల్ లో విర్జిన్, ఎక్స్ ట్రా విర్జిన్, కోల్డ్ ప్రెస్డ్ రకాలే మంచివి. ఆలివ్ గింజలను ప్రెస్ చేయడం ద్వారా నూనెను తీస్తారు. అలాకాకుండా సాల్వెంట్లు, వేడి చేయడం ద్వారా తీసే నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అంతగా ఉండవు.

బీన్స్

బీన్స్ గుండెకు చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే సొల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ ను కరిగిపోయేలా చేస్తుంది. దీంతో ఆ కొలెస్ట్రాల్ రక్తనాళాల గోడలపై పేరుకునే లోపే వాటిని శరీరం బయటకు పంపిచేస్తుంది. అందుకే గుండె జబ్బులు, రక్తపోటు సమస్యలున్నవారు పీచు పదార్థాలు ఉండే వాటిని అధికంగా తీసుకోవాలి. సొల్యుబుల్ ఫైబర్ అధికండా ఉండే బీన్స్ తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ 15 శాతం వరకు తగ్గుతున్నట్టు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఆహారాల్లో బీన్స్ కూడా ఒకటి. రోజులో ఒక కప్పు మేర బీన్స్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బీన్స్ లో 2 నుంచి 3 శాతమే ఫ్యాట్ ఉంటుంది. కొలెస్ట్రాల్ ఉండదు. మాంసాహారం తీసుకోని వారు తినాల్సిన చక్కని ప్రత్యామ్నాయం ఇది. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉండేందుకు బీన్స్ ఉపయోగపడతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories