మహాకూటమికి గ్లామర్ బూస్ట్...ప్రచార పర్వంలోకి టాలీవుడ్ స్టార్

Submitted by arun on Sat, 11/17/2018 - 10:55
Mahakutami

తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి సింహా దిగుతున్నాడు. మహాకూటమి తరుపున టీడీపీ ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రచారం చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ విజయశాంతి ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ రంగంలోకి దిగనుండడంతో మహాకూటమికి గ్లామర్ తోడు కాగా టీఆర్ ఎస్ లో కలవరం పుట్టిస్తోంది. తెలంగాణలో చావు లోతు కష్టాల్లో ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పొత్తు కొత్త జోష్ ఇస్తుంది. మహాకూటమిలో కోరిన సీట్లను టీడీపీ దక్కించుకుంది. మహాకూటమి తరపున ప్రచారం చేస్తానని హిందూపురం ఎమ్మెల్యే, నటరత్న బాలకృష్ణ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహల్లో మునిగితేలుతున్నారు. 

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా దివంగత హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తున్నారు. నామినేషన్ దాఖలుకు ముందు బాలకృష్ణతో కలిసి ఆమె ఎన్టీఆర్ ఘాట్ లో తాతకు ఘన నివాళి అర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ..తెలంగాణలో మహాకూటమి తరపున ఈ నెల 26 నుంచి ప్రచారం చేస్తానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచార బరిలోకి దిగుతారా అనే ప్రశ్నపై బాలకృష్ణ స్పందించారు. ఎన్నికల్లో ప్రచారం చేయాలా వద్దా అనేది జూనియర్ ఎన్టీఆర్ ఇష్టానికే వదిలేస్తున్నాని చెప్పారు. కూకట్ పల్లిలో టీడీపీ అభ్యర్థి సుహాసిని మద్దతుగా ఆమె సోదరుడు కల్యాణ్ రామ్ మద్దతుగా నిలువనున్నాడు. తన సోదరి సుహాసినికి మద్దతుగా ప్రచారం చేస్తానని కల్యాణ్ రామ్ తెలిపారు. 

ఇప్పటికే కాంగ్రెస్ తరపున విజయశాంతి స్టార్ క్యాంపెనర్ గా ఉన్నారు. మహాకూటమి తరపున తాను కూడా ప్రచారం చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు. వీరిద్దరూ జంటగా పలు హిట్ సినిమాల్లో నటించారు. అభిమానులను ఆనందపరవశ్యంలో ముంచిన ఈ జోడీ ఇప్పుడు ఓటర్ దేవుళ్ల అభిమానం పొందే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ, విజయశాంతి ప్రచారం చేయనుండడంతో మహాకూటమికి గ్లామర్ తళుక్కు వచ్చింది. మరీ ఈ జోడీ మహాకూటమికి ఓట్లు తెచ్చిపెడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. విజయశాంతికి తోడుగా  బాలకృష్ణ ప్రచార బరిలోకి దిగనుండడంతో టీఆర్ ఎస్ లో కలవరం రేపుతోంది. 

English Title
vijayashanthi balakrishna in election campaign

MORE FROM AUTHOR

RELATED ARTICLES