నోటు ముందు చిన్నబోయిన ఓటు...దేశ చరిత్రలో తొలి సారిగా...

నోటు ముందు చిన్నబోయిన ఓటు...దేశ చరిత్రలో తొలి సారిగా...
x
Highlights

దేశ ప్రజాస్వామ్య వ్యవస్దలో మరో దుర్ధినం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్ధ ఆయువు పట్టయిన ఎన్నికల వ్యవస్ధను అపహాస్యం చేసేందుకు కొందరు నేతలు...

దేశ ప్రజాస్వామ్య వ్యవస్దలో మరో దుర్ధినం చోటు చేసుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్ధ ఆయువు పట్టయిన ఎన్నికల వ్యవస్ధను అపహాస్యం చేసేందుకు కొందరు నేతలు బరితెగించారు. ఓటుకు నోటు అంటూ బేరసారాలకు దిగారు. ప్రజాభిప్రాయాన్ని పచ్చనోట్లతో కొనుగోలు చేస్తున్న తీరును చూసి తట్టుకోలేని ఈసీ ఏకంగా ఎన్నికను వాయిదా వేసింది. మితిమీరిన ధనదాహం కారణంగా దేశ చరిత్రలో తొలి సారిగా ఓ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నిక రద్దయ్యింది.

రైలు బండి బతుకు బండినే కాదు ప్రజాస్వామ్యాన్ని శాసించే స్ధితికి నోటు చేరుకుంది. ఎన్నికల వేళ కట్టలు తెంచుకుంటున్న నగదు ప్రవాహం ప్రజాస్వామ్య స్పూర్తిని కాలరాస్తూ ఓటుకు రేటు లెక్కగట్టి గెలుపు ఓటుములను శాసించే చేసే స్ధితికి చేరుకుంది. ఇంట్లో చూసిన డబ్బే , కార్యాలయంలోనే చూసిన డబ్బే , గోడౌన్‌లో వెతికినా డబ్బే , కారులో చూసిన డబ్బే ఇది తమిళనాడులోని తాజా పరిస్ధితి. ఏపీకి పొరుగునే ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి రోజు నుంచే గోనె సంచుల్లో, అట్ట పెట్టెల్లోని పచ్చ నోట్లు బయటకు వచ్చాయి. పోలింగ్ గడువు దగ్గర పడే కొద్ది రోజు రోజుకు నగదు ప్రవాహం కట్టలు తెంచుకుంది. నాయకుల ఇళ్లలోని నగదు ఓటర్ల చేతిలోని బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసే స్ధితికి చేరుకుంది.

రాష్ట్రంలోని 39 నియోజకవర్గాల పరిధిలో రేపు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా మితిమీరిన నగదు ప్రవాహం కారణంగా వెల్లూరు ఎన్నికను రద్దు చేశారు. వారం క్రితం డీఎంకే అభ్యర్థి కదిర్‌ ఆనంద్‌ కార్యాలయంలో 11 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఈసీ నియోజకవర్గంలోని తాజా పరిస్ధితిపై వివరణ ఇవ్వాలంటూ ఆదాయపన్ను శాఖతో పాటు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు మార్పిడి జరగుతోందని ఐటీ నివేదిక అందజేసింది. దీంతో పోలింగ్ రద్దు చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు రాష్ట్రపతి అంగీకరించడంతో ఎన్నిక రద్దయ్యింది. అయితే ఈ నియోజకవర్గ పరిధిలో గల రెండు శాసనసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరగనున్నాయి. ధన ప్రవాహం కారణంగా దేశ చరిత్రలో ఓ పార్లమెంట్ ఎన్నిక నిర్వాహణ రద్దు కావడం ఇదే తొలిసారని చెబుతున్నారు. దీంతో పాటు తుత్తుకుడి డీఎంకే అభ్యర్ధిని కనుమొళి ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈసీ నిర్ణయంపై అటు డీఎంకే, ఇటు అన్నా డీఎంకే పరిస్పర రాజకీయ విమర్శలకు దిగాయి. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎన్నిక నిర్వాహణను రద్దు చేశారంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా హత్య చేశారంటూ ఘాటు విమర్శలు చేశారు. డీఎంకే వ్యాఖ్యలపై సీఎం పళనిస్వామి నేరుగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్ధను అపహాస్యం చేస్తూ కోట్లాది రూపాయలతో పట్టుబడిన డీఎంకే అభ్యర్ధి కదిర్ ఆనంద్‌పై వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు.

నేతల విమర్శలు ఎలా ఉన్నా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన రోజు నుంచి ఇప్పటివరకు 295 కోట్ల నగదుతో పాటు 205 కోట్ల విలువ గల 11 వందల కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని బట్టే తెలుసుకోవచ్చు తమిళనాట ఎన్నికలు ఎంత ఖరీదుగా మారాయో. ప్రస్తుతం పోలింగ్ రద్దయిన వెల్లూరు నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వీరిలో అధిక శాతం వ్యాపారవేత్తలే ఉన్నారు. వీరు ఎలాగైన గెలుపు సాధించాలనే లక్ష్యంతో భారీ స్ధాయిలో నగదు ప్రవాహానికి తెర తీసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రాజకీయాల్లో రోజురోజుకు పెరుగుతున్న నగదు ప్రమేయంపై మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేసే ఇలాంటి ఘటనలపై అప్రమత్తం కాకపోతే పెనుమూల్యం చెల్లించుకోకతప్పదంటూ హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories