రంగా రక్తం ఎందుకిలా ఉడికిందసలు?

Submitted by santosh on Tue, 09/18/2018 - 12:16
vangaveeti radha vangaveeti ranga

విజయవాడ వైసీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. విజయవాడ సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించారంటూ వచ్చిన వార్తలతో వంగవీటి రాధా వర్గం తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. ఒక దశలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దాంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 

కృష్ణా జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు తారా స్థాయికి చేరాయి. విజయవాడ సెంట్రల్ సీటు వంగవీటి రాధాకు కాకుండా మల్లాది విష్ణుకు కేటాయించారని వచ్చిన వార్తలతో రాధా వర్గంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. రాధాకు వైకాపా నుంచి విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలంటూ ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు.  రంగా ఇంటి దగ్గర, ఆఫీస్‌ దగ్గరున్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో రంగా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాధాకు సీటు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. 

విజయవాడలో రాధా రంగా మిత్రమండలి ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అయితే అభిమానుల తీరుపై రాధా ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్రోల్ పోసుకున్న వారిపై రాధా నీళ్లు చల్లి.. ఇది సరైన పద్ధతి కాదని సంయమనం పాటించాలని అభిమానులకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి సైతం ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకొని వారికి సర్ది చెప్పారు. అయితే రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వకపోతే తామంతా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని రాధా అనుచరులు అధిష్ఠానాన్ని హెచ్చరించారు. 

మరోవైపు రాధా అభిమానుల ఆందోళనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించారు. అనవసరంగా లేనిది ఉన్నట్లు ఊహించుకుని ఆవేశపడటం వల్ల ఉపయోగమేమీ లేదని, అంతా సంయమనం పాటించాలని కోరారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని పేపర్లలో చూసి అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల టిక్కెట్ల కేటాయింపుపై వైసీపీలో ఇంత వరకూ ప్రస్తావనే రాలేదని తెలిపారు. అనవసరంగా ఎవరూ ఆందోళన చెందవద్దని వంగవీటి అభిమానులను ఆయన కోరారు.మొత్తానికి విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వివాదం ఎంతవరకూ దారి తీస్తుందో వేచి చూడాలి. 

English Title
vangaveeti radha vangaveeti ranga

MORE FROM AUTHOR

RELATED ARTICLES