మోదీకి మరో బీజేపీ ఎంపీ షాక్‌

Submitted by arun on Sat, 04/07/2018 - 15:40
MP Yashwant Singh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం...’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత, గిరిజన ఎంపీలు ఒక్కొక్కరిగా సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నది. బహ్రెయిచ్‌ ఎంపీ సావిత్రి బాయి మొన్న ఒక ర్యాలీలో మాట్లాడుతూ.. ‘దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం ఒత్తిడి తెస్తున్నా.. బీజేపీ మౌనంగా ఉండటంలో అర్థమేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాబర్ట్‌గంజ్‌ బీజేపీ ఎంపీ చోటేలాల్‌.. మోదీకి రాసిన లేఖలో యూపీ సీఎం యోగి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. తన జిల్లాలో అధికారుల అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే సీఎం సిబ్బంది తనను గల్లాపట్టి నెట్టేశారని ఆరోపించిన చోటేలాల్‌.. పార్టీలో దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అన్ని వాపోయారు. ఆ మరుసటి రోజే.. ఇటావా స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గిరిజన బీజేపీ ఎంపీ అశోక్‌ దోహ్రీ.. యూపీలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, భారత్‌ బంద్‌లో పాల్గొన్న దళితులపై యోగి సర్కార్‌ తప్పుడుకేసులు బనాయిస్తున్నదంటూ ప్రధాని మోదీకి లేఖరాశారు. ఇప్పుడు నగీనా ఎంపీ యశ్వంత్.. బీజేపీ పాలనలో దళితులకు న్యాయం జరగలేదని బాంబు పేల్చారు. తాజా ఆరోపణలపై బీజేపీ అధిష్టానం స్పందించాల్సిఉంది.

English Title
Uttar Pradesh: Now, BJP MP Yashwant Singh writes to PM Modi over Dalits being ‘ignored’

MORE FROM AUTHOR

RELATED ARTICLES