నేడు బీజేపీ పెద్దలతో రాజగోపాల్‌రెడ్డి భేటీ? జగ్గారెడ్డి కూడా బీజేపీలో చేరతారా..?

నేడు బీజేపీ పెద్దలతో రాజగోపాల్‌రెడ్డి భేటీ? జగ్గారెడ్డి కూడా బీజేపీలో చేరతారా..?
x
Highlights

కాంగ్రెస్‌ను వీడెందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తూ వెళ్తూ హస్తం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు....

కాంగ్రెస్‌ను వీడెందుకు సిద్ధమైన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తూ వెళ్తూ హస్తం పార్టీకి ఊహించని షాక్ ఇచ్చేలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే లోపే పార్టీని చావుదెబ్బ తీసేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా పార్టీలోని అసంతృప్త నేతలను, ఇతర ప్రముఖులను కమలం గూటికి లాక్కెళ్లేందుకు స్కెచ్‌ వేస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఇవాళ బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యి కమలం తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. సొంతపార్టీపై ఎదురుతిరిగిన మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భారీ స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. తనతో పాటే మరికొందరు అసంతృప్తులకు కమలం తీర్థం ఇచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బతికి బట్ట కట్టే అవకాశం లేదని కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాజగోపాల్‌రెడ్డి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని బల్లగుద్ది చెప్పారు. రాహుల్‌గాంధీ గ్రాఫ్‌ క్రమంగా పడిపోతుందని సీఎల్పీ విలీనం అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే తాజాగా పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా తనతో పాటే లాక్కెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రాజగోపాల్‌రెడ్డి ఫోన్‌ చేసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీంతో జగ్గారెడ్డి కూడా కమలం గూట్లో చేరుతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్వతహాగా హిందూ భావాలు అధికంగా ఉన్న జగ్గారెడ్డి గతంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయిన ఆయన మళ్లీ కాంగ్రెస్‌ గూటికి తిరిగివచ్చారు. అన్నీ కుదిరితే ఇవాళే బీజేపీ పెద్దలతో సమావేశం అయ్యేందుకు రాజగోపాల్‌రెడ్డి అన్నీ సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు. తనతో పాటే మరికొందరు నేతలు కూడా కాషాయం కండువా మార్చుకుంటారని తెలుస్తోంది. అయితే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు సమర్థనీయం కావని సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం భేటీ కానుంది. కోమటిరెడ్డి తీరుపై చర్చించనున్న టీపీసీసీ పెద్దలు ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories