చనిపోనివ్వండి.. ప్లీజ్‌!

చనిపోనివ్వండి.. ప్లీజ్‌!
x
Highlights

బతికించండి.. లేదా కారుణ్య మరణానికి అనుమతించి నా అవయవాలు అవసరమైన వారికి దానం చేయండి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఓ నిరుపేద మహిళ పెట్టుకున్న అర్జీ...

బతికించండి.. లేదా కారుణ్య మరణానికి అనుమతించి నా అవయవాలు అవసరమైన వారికి దానం చేయండి. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఓ నిరుపేద మహిళ పెట్టుకున్న అర్జీ ఇది. రోజూ నరకం చూపించే బాధ భరించలేక యుథెనేషియాకు అనుమతించమని ఆమె కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కోరింది.

ఆ నిరుపేద ఇల్లాలిని కడుపులో కణితి అతలాకుతలం చేసింది. ఖరీదైన వైద్యం చేయించుకోలేని ఆర్థిక ఇబ్బందులు. మానవత్వంతో ఇరుగూపొరుగూ తలో చెయ్యి వేసినా చికిత్సకు చాలవు. దీంతో మరణమే శరణమని భావిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన పత్తి కొండబాబు ఓ లారీ డ్రైవర్. అతని భార్య రామలక్ష్మికి రెండేళ్ల క్రితం కడుపునొప్పి రావడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. మలద్వారం దగ్గర శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి రామలక్ష్మికి పొట్ట బరువు పెరగడం ఏమీ తినలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. ఆస్పత్రికి వెళ్తే కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించారు.

అప్పటి నుంచి రామలక్ష్మి మంచం దిగడం లేదు. నిత్యం నరకం. ఇప్పటికి ఆ కణితి 25 కేజీలకు పైగా బరువు పెరిగింది. ఆమె బాధ చూడలేక చుట్టుపక్కల వాళ్లు చందాలు వేసుకుని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి పంపించారు. వాళ్లు ఇదో అరుదైన వ్యాధని వెంటనే చికిత్స చేసి కణితిని తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. దీనికి 4.5-5 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.

అప్పటికే ఎన్టీఆర్ వైద్యసేవలో ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నందు వల్ల మరోసారి ఉచితంగా శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో దీనికి వైద్యం లేకపోవడంతో రెండేళ్లుగా ఆమె నిత్యం నరకం చూస్తోంది. వైద్యం చేయించే స్థోమత భర్తకు లేదు ఆమె మామూలు మనిషవ్వాలనే కోరిక ఉన్నా అంత పెద్దమొత్తం ఇచ్చేంత డబ్బు ఇరుగుపొరుగు లేరు.

స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 1.01 లక్షలు మంజూరైంది. అయితే అది ఆపరేషన్‌కు చాలదని రామలక్ష్మి కుటుంబం ఆ డబ్బు తీసుకోలేదు. మరో దారి లేక, బాధ భరించలేక అనాయాస మరణానికి అనుమతించాలని రామలక్ష్మి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు దరఖాస్తు చేసుకుంది. చనిపోయాక తన అవయవాలు అవసరమైన వారికి దానం చేయాలని వేడుకుంది.

భార్య మరణానికి చేరువవుతుంటే నిస్సహాయంగా చూడటం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉన్న కొండబాబు తాను, ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోతానంటున్నాడు. అయితే తమ దుస్థితిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు మంజూరు చేస్తామన్నారని ఆ కుటుంబం చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories