రెండో రోజు దద్దరిల్లిన ఇంటర్‌ బోర్డ్‌ ఆఫీస్‌..

రెండో రోజు దద్దరిల్లిన ఇంటర్‌ బోర్డ్‌ ఆఫీస్‌..
x
Highlights

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంటర్‌ బోర్డ్‌ నిర్వాకంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా విద్యార్థీ నాయకులు ఇంటర్‌ కార్యాలయం ముట్టడికి...

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న ఇంటర్‌ బోర్డ్‌ నిర్వాకంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగళవారం కూడా విద్యార్థీ నాయకులు ఇంటర్‌ కార్యాలయం ముట్టడికి పిలుపిచ్చారు. అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టాలని బాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇటు మినిస్టర్‌ క్వార్టర్స్‌ ను కూడా విద్యార్థీ నాయకులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విద్యార్థీ సంఘాలు, విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళనలతో నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యాలయం రెండో రోజూ దద్దరిల్లింది. ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై.. కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థీ సంఘం నాయకుల ఆందోళనలతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయం ముందు బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు ఆందోళనలో పాల్గొన్న ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు బోర్డు నిర్లక్ష్యం వల్ల.. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూల్యాంకనంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నినాదాలు చేశారు.

మరోవైపు పెద్ద ఎత్తున బలగాలు కార్యాలయానికి చేరుకుని ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇటు విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. అయితే ఆయన్ను కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక రీ వాల్యూయేషన్‌కు బుధవారమే చివరి రోజు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదని వాపోతున్నారు. అయితే రీ కౌంటింగ్ కు అప్లై చేయాలా లేక సప్లిమెంటరీ పరీక్షలు రాయాలా అన్నదానిపై క్లారిటీ రావడం లేదంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోర్డ్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించడంతో అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. కార్యాలయానికి మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, బారికేడ్లతో రోడ్డును బ్లాక్‌ చేసి భద్రత కల్పిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories