నివురుగప్పిన నిప్పులా ఉట్నూరు ఏజెన్సీ

నివురుగప్పిన నిప్పులా ఉట్నూరు ఏజెన్సీ
x
Highlights

ఆదివాసీలు, లంబాడీల ఘర్షణతో ఆదిలాబాద్‌ ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. నిన్న ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌...

ఆదివాసీలు, లంబాడీల ఘర్షణతో ఆదిలాబాద్‌ ఏజెన్సీ నివురుగప్పిన నిప్పులా మారింది. నిన్న ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగడంతో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఏజెన్సీ మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్‌ ఏజెన్సీలో ఎనిమిది జిల్లాల నుంచి వచ్చిన వెయ్యి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా డిచ్‌పల్లిలో 13 బెటాలియన్‌లు, గుడిపేటలో 7 బెటాలియన్‌ల పోలీసులను మోహరించారు. ఉట్నూరు‌, నార్నూర్‌, జైనూర్‌ మండలాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఒక డీఐజీ, ముగ్గురు ఐజీలు , ఇద్దరు పోలీస్ కమిషనర్లు, 9 మంది ఎస్పీలు ఉట్నూర్‌ ఏజెన్సీలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఆదివాసీలు, లంబాడీల ఘర్షణ నేపథ్యంలో ఉట్నూరు వైపు ప్రజలు వెళ్లకుండా ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఉట్నూరు వైపు వెళ్లే బస్సులను దారి మళ్లించి నడుపుతున్నారు. అలాగే ఆదిలాబాద్‌ ఏజెన్సీలో సోషల్ మీడియాపై ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపించే అవకాశం ఉండడంతో అధికారులు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్‌ బంద్‌కు ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. నార్నూర్‌ మండలం బేతాల్‌గూడలో గుర్తుతెలియని వ్యక్తులు గోండు వీరుడు కొమ్రం భీం విగ్రహానికి చెప్పులదండ వేయడాన్ని నిరశిస్తూ..బంద్‌ పాటిస్తున్నారు.

ఇక ఇవాళ ముత్నూర్‌ నుంచి ఇంద్రవెల్లికి శాంతి ర్యాలీ నిర్వహిస్తామని ఆదివాసీ నాయకులు ప్రకటించారు. ఆదివాసీలు న్యాయమైన డిమాండ్‌తో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే, ఆదివాసీలను లంబాడాలు రెచ్చకొట్టడం సమంజసం కాదని ఆదివాసీ నేతలు అంటున్నారు. పైగా లంబాడాలు ఆదివాసీలపై దాడులు చేయడం, తమ జాతి పోరాట వీరుడి విగ్రహాన్ని అవమాన పరచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నింస్తున్నారు. కొమ్రం భీం విగ్రహానికి ఇవాళ ముత్నూర్‌లో పాలాభిషేకం నిర్వహించి 5 కిలో మీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని ఆదివాసీ నేతలు ప్రకటించారు.

గురువారం రాత్రి నార్నూర్‌ మండలం బేతాల్‌గూడ గ్రామంలోని గోండు వీరుడు కొమ్రం భీం విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులదండ వేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చెలరేగాయి. వివిధ గ్రామాల నుంచి వందల మంది ఆదివాసీలు ఉట్నూర్‌ మండలం దేవుగూడ వద్ద చేరుకొని రాస్తారోకో చేశారు. తర్వాత ఉట్నూరు దిశగా వెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిందితుల్ని పట్టుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆదివాసీలు శాంతించారు. ఇదేసమయంలో లంబాడీ వర్గం ర్యాలీగా అక్కడికిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఎదురెదురు పడ్డాయి. ఇంతలో హస్నాపూర్‌లో ఆదివాసీలపై దాడులు జరిగాయని వదంతులు వచ్చాయి. అలా ఇరువర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఊట్నూరు ఏజెన్సీలో భారీగా విధ్వంసం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories