ఏమిటీ గందరగోళం.. ఎందుకీ అయోమయం!!

Highlights

ఏమిటీ గందరగోళం.. ఎందుకీ అయోమయం!! అంచనాల్లేకుండా అనాలోచిత నిర్ణయాలు ఎందుకు? నిండుతున్న ఖజానాకు చిల్లు పెడుతున్న ఘనులెవ్వరు? చేటు తెస్తే తాట తీస్తానన్న...

ఏమిటీ గందరగోళం.. ఎందుకీ అయోమయం!! అంచనాల్లేకుండా అనాలోచిత నిర్ణయాలు ఎందుకు? నిండుతున్న ఖజానాకు చిల్లు పెడుతున్న ఘనులెవ్వరు? చేటు తెస్తే తాట తీస్తానన్న ఈవో వార్నింగ్‌ గాల్లో కలిసిపోయిందని అనుకోవాలా? భక్తుల బాధలు చూసి బాధపడాలా? తిరుమల తిరుపతి దేవస్థానం చేతులు కాలాక ఆకులు ఎందుకు పట్టుకుంటుంది.? టీటీడీకి ఎందుకింత తికమక?

టీటీడీ అధికారులు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. ఓ కొత్త మార్పు చేపట్టే ముందు దానిలో ఉన్న లోటుపాట్లను పూర్తిగా అంచనా వేయాలి. అలాకాకుండా ఆగమేగాలపై అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేస్తున్నారు. దీని వల్ల మాన్య భక్తులకు అగచాట్లు తప్పకపోగా వెంకన్న ఖజానాకు భారీగా గండిపడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన తర్వాత ఆ ఆలోచనలకు వెనక్కు తీసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి లేకపోవడంతో కొత్తగా ఈవో బాధ్యతలు చేపట్టిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌పై ఆరోపణలు గుప్పుమంటున్నాయ్. సింఘాల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాశంగా మారుతున్నాయ్.

కొండంత నమ్మకంతో ఏడుకొండలు ఎక్కి వస్తున్న వెంకన్న భక్తులపై అధికారులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తిరుమల వస్తున్న భక్తులకు టీటీడీ అధికారులు తీసుకుంటున్న తాజా నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీకేడర్‌కు చెందిన ఉత్తరాది సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈఓగా బాధ్యతలు తీసకున్న తర్వాత చేపట్టిన ఈ కార్యక్రమాలు చర్చనీయాంశంగా మారుతుతున్నాయి. దీని వల్ల సమస్య పరిష్కారం దిశగా కాకుండా సరికొత్త సమస్యల్ని తెచ్చిపెడుతుంది. దీనికి తోడు టీటీడీ బోర్డు కూడా లేకపోవడంతో అధికారుల తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ప్రయోగాలు భక్తులకు కొరకురాని కొయ్యగా మారాయని మండిపడుతున్నారు స్థానికులు.

తిరుమల వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం.... ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పడు సమీక్షించుకుని మార్పులు చేస్తుంటుంది టీటీడీ. ఇలా చేపట్టిన తీసుకునే నూతన నిర్ణయాలు పాత విధానాల కన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తే అందరరూ ఆహ్వానిస్తారు. కానీ అలా జరుగకుండా టీటీడీ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు భక్తులకు మరిన్ని కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయ్.

తిరుమల వచ్చే వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం చేయిస్తుంది టీటీడీ. దీని కోసం శ్రీవారి ఆలయం వెనుక వైపున మ్యూజియం వద్ద నుంచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్ల ద్వారా దక్షిణ మాఢ వీధిలో ఉన్న కౌంటర్ వద్దకు చేరుకుంటే రోజుకి రెండు విడతలుగా 1500 టికెట్లను వృద్ధులు, వికలాంగులకి కేటాయించేది టీటీడీ. కానీ ఈసారి పరిస్థితిలో మార్పు వచ్చింది. చాలా కాలం నుంచి పాత విధానానికి అలవాటుపడ్డారు భక్తులు. అయితే ఎలాంటి సమాచారం లేకుండా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. ఈ నూతన విధానం గురించి తెలియని భక్తులు తిరుమల వచ్చి ఇబ్బంది పడుతున్నారు. రద్దీ తక్కువగా ఉన్న కొన్ని సందర్భాల్లో మాత్రం వృద్ధులు, వికలాంగులకి దర్శన టోకెన్లు లభిస్తున్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మరుసటి రోజు వరకు భక్తులు వేచిఉండాల్సి వస్తుంది.

ఇక దివ్యదర్శనం టిక్కెట్ల జారీలోనూ టీటీడీ నిర్ణయాలు భక్తులకు ఇబ్బందికి గురిచేస్తున్నాయ్. వీకెండ్‌లో దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వమని చెప్పింది టీటీడీ. ఈ నిర్ణయాన్ని భక్తులు తీవ్రంగా వ్వతిరేకించారు. ప్రభుత్వం నుంచి కూడా ప్రతికూలత రావడడంతో టీటీడీ వెనక్కు తగ్గింది. ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. టీటీడీ తీసుకున్న నిర్ణయంపై భక్తులకు అవగాహన లేకపోవడంతో మెట్ల మార్గంలో వచ్చే చాలా మంది భక్తులు తమకు ప్రత్యేక దర్శనం లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇక అద్దె గదుల కేటాయింపులో టీటీడీ పెట్టిన నూతన విధానం తీవ్ర గందరగోళంలో ఉంది. భక్తులు తొలుత సీఆర్ఓ ఆఫీసు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌ల వద్దకి వెళ్లి తమ ఆధార్‌తో పాటు ఎంతలో రూము కావాలి అన్న విషయాలు ఇవ్వాలి. దీంతో మొబైల్ నెంబరుకి ఓ మెసేజ్ వస్తుంది దీనిలో భక్తులకు ఓ టోకెన్ నెంబరు కేటాయిస్తారు. ఈ తతంగమంతా పూర్తి చేసిన తర్వాత గది కేటాయించే సమయం వరకు వేచి ఉండాలి. దీనిపైనా భక్తులు మండిపడుతున్నారు.

టీటీడీ గతంలో క్యూలైన్లలో తీసకున్న మార్పుల వల్ల రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శనం చేయించే అవకాశం కలుగుతూ ఉండేది. అయితే మళ్లీ ఈ మధ్య శ్రీవారి ఆలయంలో నూతన క్యూలైన్ విధానం అంటూ ఆర్భాటంగా మరో కొత్త విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. ఈ తాజా క్యూలైన్ విధానం అంతగా ఫలితం ఇస్తున్నట్టు కనపడటంలేదు. ఇక ఇటీవల కాలంలో ఆలయంలోని వెండి వాకిలిఉన్న రెండో ప్రాకారంలో ఏర్పాటు చేసిన 15అడుగులు ఎత్తున్న నూతన ఇనుప మెట్ల ప్రయోగంపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రద్దీ సమయాల్లో ఈ ఇనుప మెట్లను ఎక్కించి దించడంపై భక్తులు మండిపడ్డారు. ఏమైనా ఈ ప్రణాళికలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ విధానం ఆగమ శాస్రవిరుద్దమని పలువురు పండితుల చెప్పడంతో పాటు రచ్చ రచ్చ కావడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఈ నిర్ణయాలన్నీ టీటీడీ ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం తర్వాత జరిగినవే కావడంపై స్థానికులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సింఘాల్ తీసుకునే నిర్ణయాలు భక్తుల సున్నితమైన మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయ్. టీటీడీ ఆచారవ్యవహారాలు తనకు కొత్త కావడం, తనకు పెద్దగా అవగాహనకు లేకపోవడంతో ఆలయ బాధ్యతలను పూర్తిగా అధికారులకే అప్పగించేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories