12 రాష్ట్రాల్లోని 96 స్ధానాల్లో రేపు ఎన్నికలు

12 రాష్ట్రాల్లోని 96 స్ధానాల్లో రేపు ఎన్నికలు
x
Highlights

దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల నిర్వాహణకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. 12 రాష్ట్రాల పరిధిలోని 96 లోక్‌సభ స్ధానాలు 53 శాసనసభ స్ధానాలకు కట్టుదిట్టమైన...

దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికల నిర్వాహణకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. 12 రాష్ట్రాల పరిధిలోని 96 లోక్‌సభ స్ధానాలు 53 శాసనసభ స్ధానాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది.

దేశ వ్యాప్తంగా రెండో విడత ఎన్నికలు జరిగే 96 లోక్ సభ నియోజకవర్గాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. షెడ్యూల్ ప్రకారం 97 చోట్ల ఎన్నికలు జరగాల్సి ఉన్నా మితిమీరిన ధన ప్రవాహం కారణంగా తమిళనాడులోని వెల్లూరు ఎన్నికను ఈసీ రద్దు చేసింది. దీంతో 96 స్ధానాల్లో ఎన్నికలు రేపు జరగనున్నాయి. తమిళనాడులో వెల్లూరు మినహా మిగిలిన 38 స్ధానాలతో పాటు, దినకరన్ వర్గంగా గుర్తింపు పొంది అనర్హత వేటుకు గురైన 18 మంది శాసనసభ్యుల నియోజకవర్గాల్లో రేపు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు ఏకైక లోక్ సభ స్ధానం ఉన్న పాండిచ్చేరిలోనూ గురువారమే ఎన్నికలు జరగనున్నాయి. ధన ప్రవాహం అధికంగా ఉండటంతో ఈసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తోంది.

తమిళనాడుతో పాటు కర్నాటకలోని 14 లోక్‌సభ స్ధానాలకు, మహారాష్ట్ర 10 స్ధానాల్లో, ఉత్తర ప్రదేశ్‌లోని 8 చోట్ల ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటితో పాటు అస్సోం, బీహార్‌, ఒడిసాలో ఐదేసి స్ధానాల చొప్పున పోలింగ్ జరగనుంది. ఒడిసాలో 35 శాసనసభ స్ధానాలకు కూడా ఎన్నికలు ఏక కాలంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్లో మూడు స్ధానాల చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. ఇక జమ్ముకశ్మీర్‌లో రెండు స్ధానాలకు, మణిపూర్‌, త్రిపురల్లో ఒక్కో స్ధానానికి పోలింగ్‌ నిర్వహించనున్నారు.

రెండో విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉండటంతో ఈసీ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అదనపు బలగాలను ఆయా ప్రాంతాలకు తరలించిన ఈసీ ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆయా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించిన ఈసీ సాయంత్రానికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయనుంది. సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించిన ఈసీ లైవ్‌ వెబ్ కాస్టింగ్‌తో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories