డ్రగ్స్‌ కేసులో సిట్‌ ఏం తేల్చింది...టాలీవుడ్‌ లింకులు ఎందుకు మిస్ అయ్యాయి?

డ్రగ్స్‌ కేసులో సిట్‌ ఏం తేల్చింది...టాలీవుడ్‌ లింకులు ఎందుకు మిస్ అయ్యాయి?
x
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసు నీరుగారిందా...? ఈ కేసు నుంచి ప్రముఖులను తప్పించారా డ్రగ్స్ కేసులో కొండను తవ్వి ఎలుకను పట్టారా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్...

టాలీవుడ్ డ్రగ్స్ కేసు నీరుగారిందా...? ఈ కేసు నుంచి ప్రముఖులను తప్పించారా డ్రగ్స్ కేసులో కొండను తవ్వి ఎలుకను పట్టారా సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ ఇచ్చారా....? అంటే తాజాగా వెలుగులోకి వస్తున్న విషయాలు అవుననే సమాధానం చెబుతున్నాయి.

2017లో టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదుపేసిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. రవితేజ, పూరి జగన్నాధ్, తరుణ్, నవదీప్, చిన్నా, చార్మికౌర్, శ్యామ్ కె నాయుడు, తనీష్, నందు, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ లాంటి ప్రముఖులతో పాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్‌ను సిట్ విచారించింది. ఆ తర్వాత మెల్లిగా ఈ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌లో కనుమరుగైంది. డ్రగ్స్ కేసులో సిట్ నాలుగు చార్జీషీట్లు దాఖలు చేసింది. 12 కేసులు నమోదు చేసింది. కేసు విచారణ నిమిత్తం సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల గోర్లు, వెంట్రుకల నమూనాలను సిట్ సేకరించింది. అయితే వాటి ఫలితాల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.

తాజాగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు పద్మనాభరెడ్డి సమాచార హక్కు చట్టం ద్వారా టాలీవుడ్ డ్రగ్స్ కేసు వివరాలు సేకరించారు. డ్రగ్స్ కేసులో మొత్తం 4 చార్జిషీట్లు ఫైల్ చేసినట్లు వివిధ ఘటనల్లో 12 కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. టాలీవుడ్‌కు చెందిన యాక్టర్లు, డైరెక్టర్లు, ఇతరులతో కలిపి మొత్తం 62మందిని ఈకేసులో విచారించారు. వీరిలో 12 మంది సినీ పరిశ్రమకు చెందినవారు, 50మంది ప్రముఖుల పిల్లలు, కార్పొరేట్ స్కూల్ విద్యార్థులున్నట్లు వెల్లడైంది.

అయితే డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులతోపాటు అందరికీ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అధికారులు దాఖలు చేసిన 4చార్జిషీట్లలో దేనిలో కూడా సినీ ప్రముఖుల పేర్లు, విఐపీల పిల్లల పేర్లను చేర్చలేదు. ఒక చార్జిషీట్‌లో సౌతాఫ్రికాకు చెందిన రఫెల్ అలెక్స్ విక్టర్ పేరు ప్రస్తావించారు. అతడు ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు.

డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తి, ఈవెంట్ మేనేజర్‌పైన మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. డ్రగ్స్ ఉపయోగించిన వారు కూడా నేరస్తులే. వారిపై ఎక్కడా చార్జిషీట్ దాఖలు చేయలేదు. మాదక ద్రవ్యాల కేసులో ఎక్సైజ్ శాఖకు చెందిన ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని విచారణకు నియమించారు. ఇంతపెద్ద కేసును చిన్నస్థాయి అధికారి ఎలా దర్యాప్తు చేయగలుగుతారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు మినహాయింపు నిచ్చారన్న వార్తలను ఎక్సైజ్ శాఖ తోసిపుచ్చింది. డ్రగ్స్ కేసులో ఇంకా చార్జిషీటు వేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అది 2018 జూన్ 13న ఇచ్చిన సమాచారమని అప్పటి ఎక్సైజ్ కమిషనర్, ప్రస్తుత పౌరసరఫరా శా‌ఖ కమిషనర్ గా ఉన్న అకున్ సబర్వాల్ తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories