logo

కొత్త డ్రైవర్‌ రాకతో కారు పరిగెత్తే స్పీడెంత?

ఎప్పటి నుంచో అనుకున్నదే అయింది. కేసీఆర్‌ తన వారసుడిగా కేటీఆర్‌ను ప్రకటించేశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదా ఇస్తూ పార్టీలో నెంబర్‌ 2న కేటీఆరేనని తేల్చిచెప్పేశారు. పార్టీలో కీలక బాధ్యతలు చూస్తున్న తారకరాముడు... ఇక కార్యనిర్వాహక నిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. గులాబీ పార్టీకి కొత్త జోష్‌ వస్తుందంటున్న శ్రేణులు... రానున్న రోజుల్లో మరింత బలపేతమవుతుందని చెబుతున్నాయి.

కల్వకుంట్ల తారకరామారావును కేసీఆర్ కుమారుడిగా పార్టీలో అందరూ గౌరవిస్తారు. తండ్రికి తగ్గ తనయుడిగా అధినేత అప్పగించిన ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకుంటారు. ఆలస్యంగా పార్టీలోనికి వచ్చినా అందరి తలలో నాలుకై మెలిగారు. ఉద్యమకాలంలో లాఠీ దెబ్బలు తిన్నా రైల్ రోకోలు చేసిన కేటీఆర్‌కే చెల్లింది. యువతలో కేటీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతాయింతా కాదు. టీఆర్ఎస్ పార్టీలో తనదైన ముద్రవేసుకున్న కేటీఆర్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెండ్. జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో బిజీ కాబోతున్న కేసీఆర్‌... తన కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించారు.

వారసత్వం ఒక్కటే నాయకుడిగా నిలబెట్టలేదని చెప్పే కేటీఆర్‌... అధినేత అప్పగించిన పనిని విజయవంతం చేయడంలో దిట్ట. తెలంగాణ గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి కోసం తనకున్న అనుభవంతో అంతర్జాతీయ స్థాయి సంస్థలను రాజధానికి తీసుకురావడంలో కృతకృతులయ్యారు. కేటీఆర్ సమర్ధతను గుర్తించే కేసీఆర్... ఆయనకు వర్కింగ్ పదవి కట్టబెట్టారంటున్నారు పార్టీ నేతలు.

జాతీయ రాజకీయాలే తన టార్గెట్‌ అంటూ చెప్పుకొస్తున్న కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగింతతో దాన్ని మరింత బలోపేతం చేసుకుంటారని చెబుతున్నారు విశ్లేషకులు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి టీఆర్‌ఎస్‌లో నూతన అధ్యాయానికి తెరదీసి ఉంటారన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో రాష్ట్ర రాజకీయాలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి కేటీఆర్‌ అత్యంత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉంది.

santosh

santosh

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top