ఎమ్మెల్సీ పదవులపై టీఆర్‌ఎస్ వ్యూహం

ఎమ్మెల్సీ పదవులపై టీఆర్‌ఎస్ వ్యూహం
x
Highlights

అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక ఎమ్మెల్సీ పదవులపై గురిపెట్టింది టీఆర్‌ఎస్‌ పార్టీ. 17 స్థానాలు దక్కించుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా తాజాగా...

అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇక ఎమ్మెల్సీ పదవులపై గురిపెట్టింది టీఆర్‌ఎస్‌ పార్టీ. 17 స్థానాలు దక్కించుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా తాజాగా ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు మార్చి నెలాఖరున 9మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనుండటంతోపాటు పార్టీలు మారిన వారు, ఇతర పార్టీల్లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన వారు రాజీనామా చేస్తే ఆ స్థానాలన్నీ దక్కించుకునే యోచనలో ఉంది టీఆర్ఎస్.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఎమ్మెల్సీ పదవులపై గురిపెట్టింది అధికార పార్టీ. ఈ సారి 17 స్థానాలు దక్కించుకునేందుకు ప్లాన్ చేసింది టీఆర్‌ఎస్. అందులో భాగంగానే తాజాగా ఎమ్మెల్యేలుగా గెలిచిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి నిన్న రాజీనామా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతోపాటు పార్టీ మారిన మరో నలుగురిపై అనర్హత వేటుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్ పార్టీ.

అనర్హత వేటుకు వీలుగా టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీతో రాజీనామా చేయించి, మళ్లీ పోటీ చేయించే యోచనలో ఉంది గులాబీ పార్టీ. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి ఎమ్మెల్సీ స్థానాలు పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు ఆశించి పొందలేకపోయిన పార్టీ సీనియర్ నేతలకు, ఇతర పార్టీల నుంచి చేరిన చాలా మందికి ఈ పదవులిస్తామని హామీ ఇచ్చారు గులాబీ బాస్.

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు కొండా మురళి, రాములు నాయక్, యాదవరెడ్డి, భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేయించి, వాటిని దక్కించుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. అనర్హత వేటుకు సాంకేతిక సమస్యలు అడ్డు రాకుండా ముందుగా మహబూబ్‌నగర్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సభ్యుడు దామోదర్‌రెడ్డిని రాజీనామా చేయించి, మళ్లీ అక్కడే పోటీ చేయించాలని ఆ పార్టీ యోచిస్తోంది.

ఇవిగాక మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రి మహమూద్ అలీ, విపక్ష నేత షబ్బీర్ అలీ సహా 9 మంది పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది. వీటన్నింటినీ దక్కించుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాములు నాయక్‌పై అనర్హత వేటు పడితే గవర్నర్‌ కోటాలో ఒక స్థానం టీఆర్‌ఎస్‌కు దక్కుతుంది.

మండలి ఛైర్మన్ పదవికి స్వామిగౌడ్‌తోపాటు మాజీ స్పీకర్లు సురేష్‌రెడ్డి, మధుసూదనాచారి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల కోటా కింద వచ్చే ఏడు, స్థానిక సంస్థల కింద వచ్చే ఆరు, 2 ఉపాధ్యాయ, మరో గ్రాడ్యుయేట్ స్థానాలనూ దక్కించుకునేందుకు కార్యాచరణ చేపట్టింది టీఆర్ఎస్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories