గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయ్! ఎందుకీ అసమ్మతిరాగం!!

గులాబీ ముళ్లు గుచ్చుకుంటున్నాయ్! ఎందుకీ అసమ్మతిరాగం!!
x
Highlights

అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. సిట్టింగ్‌లకు టికెట్లు ప్రకటించడంతో.. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు రగిలిపోతున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా...

అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. సిట్టింగ్‌లకు టికెట్లు ప్రకటించడంతో.. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు రగిలిపోతున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా లేక.. తిరుగుబాటుకు సిద్దమవుతున్నారు. పలు జిల్లాలో అంసతృప్తి సెగలు అధికార పార్టీకి తలనొప్పి తెచ్చిపెడుతోంది. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డా.. ఈ పరిణామాలు ఎక్కడి దారితీస్తాయో అన్న చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి కేసీఆర్ మళ్లీ టికెట్లు కేటాంచారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడగా.. కొందరు సిట్టింగ్‌లపై ద్వితీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో భవిష్యత్తు ఆశతో నేతలు గులాబీ గూటికి చేరారు. ఈ ఎన్నికల్లో టికెట్టు ఖరారవుతుందని ఆశపడ్డ నేతలకు.. కేసీఆర్ ఊహలకు అందని రీతిలో సిట్టింగ్ లకు మళ్లీ టికెట్లు ప్రకటించడంతో.. టికెట్ ఆశపడ్డ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో.. సిట్టింగ్ తాజా మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వడంపై.. మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్టు కోసం చివరి వరకు ప్రయత్నం చేసిన జనార్ధన్‌గౌడ్‌కు.. నిరాశ మిగలడంతో.. సొంత పార్టీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. గాంధారి మండలంలోను అసమ్మతి సెగలు రగులుతున్నాయి. గాంధారి మండలం రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్‌తో పాటు పలువురు టీఆర్ఎస్ సీనియర్లు అలక వహించారు. పార్టీ అధినేత అభ్యర్ధిని మార్చాలని కోరుతున్నారు. జుక్కల్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే.. హన్మంత్ షిండేకు ప్రకటించడంతో.. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. ఇటు బోధన్ నియోజకవర్గంలోను అసమ్మతి కనిపిస్తోంది.

అటు- ఖానాపూర్ టిక్కెట్‌ తనకు కేటాయించకపోవడంతో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ తిరుగుబాటు జెండా ఎత్తారు. ఉట్నూర్‌లో భవిష్యత్ కార్యచరణ ప్రకటించారు. రేఖానాయక్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి గెలుస్తానంటూ తేల్చిచెప్పారు. ఇటు షాద్‌నగర్‌లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. సిట్టింగ్ అంజయ్యయాదవ్‌కు కాకుండా తమలో ఎవరో ఒకరికి సీటు వస్తుందన్న నమ్మకంతో ఉన్న వీర్లపల్లి శంకర్‌, అందబాబయ్యలు ఉమ్మడిగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ బీఫాం టిక్కెట్టు తెచ్చుకోవాలని, రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయాలని తీర్మానించారు.

అయితే టిక్కెట్టు దక్కిన సంతోషంలో ఉన్న అంజయ్య... పరిణామాలను పరిశీలిస్తున్నారు. చివరి నిమిషంలో కేటీఆర్‍ లేదా హరీష్‍ రావులను రంగంలోకి దింపి అసమ్మతి వర్గాలను శాంతింప చేయాలని అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తొలుత అధినేత కేసీఆర్‍ వద్ద తమ వాణి వినిపించుకున్న తర్వాత గానీ వీరు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. షాద్‌నగర్‌ నియోజకవర్గంలో మాత్రం టీఆర్‌ఎస్‌కి అసమ్మతి సెగ తప్పేలా లేదనిపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories