logo

కేసీఆర్‌ రాజీనామా

కేసీఆర్‌ రాజీనామా

తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నాయకుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్‌లో సమావేశమైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌‌ను టీఆర్‌ఎస్‌‌ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. తనను శాసనసభా పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌‌ను టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌‌ఎల్పీ నేతగా కేసీఆర్‌‌‌ ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతిని నర్సింహన్‌‌కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్‌ఎస్‌‌ను ఆహ్వానించాలని కోరారు. అలాగే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాకు కేసీఆర్‌‌ రాజీనామా చేసిన లేఖను అందజేయడంతో గవర్నర్ ఆమోదించారు.

ఆర్నెల్లకు ముందుగానే శాసన సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్‌ వ్యూహం ఫలించింది. సెప్టెంబర్‌ 6న కేసీఆర్‌ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, గవర్నర్‌ సూచన మేరకు అప్పటినుంచి కేసీఆర్‌ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో ఈ నెల 7న ఎన్నికలు జరగ్గా.. నిన్న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాలతో విస్పష్ట మెజార్టీని సాధించి రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రేపు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటా 25 నిమిషాలకు రాజ్‌భవన్‌‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, అతి సాధారణంగా ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్‌కు టీఆర్‌ఎస్‌ సమాచారం అందజేయడంతో కేసీఆర్‌ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది.

లైవ్ టీవి

Share it
Top