కాంగ్రెస్‌లోకి డీఎస్‌...?

x
Highlights

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు...

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌‌కి భారీ షాక్‌ తగిలే అవకాశం కనిపిస్తోంది. డీఎస్‌‌కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు ఎంపీ కవిత నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ డీఎస్‌కు వ్యతిరేకంగా జిల్లా నాయకత్వం తీర్మానం చేసింది. డీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖరాశారు.

డీఎస్‌ మళ్లీ సొంత గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మూడ్రోజులపాటు ఢిల్లీలో మకాం వేసిన డి.శ్రీనివాస్‌ రహస్యంగా కాంగ్రెస్‌ పెద్దలను కలిసినట్లు చెబుతున్నారు. రెండ్రోజులక్రితం గులాంనబీ ఆజాద్‌‌తో సమావేశమైనట్లు తెలుస్తోంది. దాంతో డీఎస్‌ తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

ఇటీవల మున్నూరు కాపు మీటింగ్‌లో పాల్గొన్న డీఎస్‌‌కు కుల సంఘం నేతలు జ్ఞానోదయం కలిగించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత అయ్యుండి టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరావంటూ కుల సంఘం నేతలు నిలదీశారు. డీఎస్‌ను తాము ఆహ్వానించలేదని, గతిలేకే మా పార్టీలో చేరారంటూ కవిత వ్యాఖ్యానించినట్లు డీఎస్‌‌కి చెప్పడంతో.... డి.శ్రీనివాస్‌ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

డి.శ్రీనివాస్‌ తన అనుచరులతో అత్యవసర సమావేశమయ్యారు. డీఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు తీర్మానం చేయడంతో తన నివాసంలో అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల తీర్మానం నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ డీఎస్‌ను అవమానిస్తే టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి గౌరవించిందని నిజామాబాద్‌ ఎంపీ కవిత అన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వస్తానంటేనే డీఎస్‌ను పార్టీలోకి చేర్చుకున్నామన్న కవిత ప్రస్తుతం డి.శ్రీనివాస్‌ వ్యవహార శైలి పార్టీ కార్యకర్తల్లో అయోమయానికి గురిచేస్తోందన్నారు. డీఎస్‌ కుటుంబం టీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా పనిచేస్తుంటే పట్టించుకోలేదని, అలాగే పలువుర్ని ఇతర పార్టీలో చేరాలని చెబుతున్నారని ఆరోపించారు.

తనకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని డీఎస్‌ లైట్‌ తీస్కున్నారు. కేసీఆర్‌కి ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. తనపై ఫిర్యాదే కదా చేస్తానంది... గొంతు కోస్తానని చెప్పలేదు కదా అంటూ కామెంట్‌ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా... ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న పరిణామాలపై తానిప్పుడేమీ మాట్లాడబోనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories