టీఆర్ఎస్‌లో నెక్ట్స్ ఎవరు....ఎంపీలే కాదు..ఎమ్మెల్సీలు తమతో...

టీఆర్ఎస్‌లో నెక్ట్స్ ఎవరు....ఎంపీలే కాదు..ఎమ్మెల్సీలు తమతో...
x
Highlights

నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి... ఇవాళ వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు. 24 గంటల్లో టీఆర్ఎస్‌కు టాటా చెప్పేసిన వారి పేర్లివి. టీఆర్ఎస్‌కు కొండా...

నిన్న కొండా విశ్వేశ్వర రెడ్డి... ఇవాళ వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు. 24 గంటల్లో టీఆర్ఎస్‌కు టాటా చెప్పేసిన వారి పేర్లివి. టీఆర్ఎస్‌కు కొండా విశ్వేశ్వర రెడ్డి ఇచ్చిన షాక్ ఆరంభం మాత్రమేనని ఇంకా మున్ముందు సినిమా చూపిస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతల మాటలు గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్ అగ్ర నేతలు చేస్తున్న ఈ వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో దడ పుట్టిస్తున్నాయి. ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్‌ చేరతారంటూ వారం క్రితం రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనం రేపింది. ఆ ఇద్దరి పేర్లు రేవంత్ ప్రకటించకపోయినా చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ మాటల్ని ఖండించారు. పార్టీ మారేది లేదని చెప్పుకొచ్చారు. అలా చెప్పిన వారం రోజుల్లోపే కొండా విశ్వేశ్వర రెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. రాహుల్‌ను కలిసి కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం పెట్టేసుకున్నారు.

కొండా విశ్వేశ్వరరెడ్డి అలా రాజీనామా చేశారో లేదో 24 గంటల్లోపే టీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది. వికారాబాద్‌ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కూడా కారు దిగేశారు. సిట్టింగ్‌ అయిన తనకు సీటు ఇవ్వకపోవడంతో పాటు తన భార్యకు టిక్కెట్ ఇస్తానని చివరి వరకు నమ్మించి మోసం చేశారంటున్న సంజీవరావు టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. టిక్కెట్ ఇవ్వని పార్టీ పెద్దలు కనీసం పిలిచి మాట్లాడలేదంటున్న సంజీవరావు తాను ఏ పార్టీలో చేరబోయేది ఇంకా ప్రకటించలేదు. అయితే ఆయన కూడా విశ్వేశ్వరరెడ్డి బాటలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

ఎంపీల రాజీనామా విషయంలో తాము చెప్పింది నిజం కావడంతో కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. విశ్వేశ్వర రెడ్డితో టీఆర్ఎస్ కు తగిలిన షాక్ ఆరంభం మాత్రమే అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా. ఎంపీలే కాదు ఎమ్మెల్సీలు తమతో టచ్‌లో ఉన్నారంటూ మరో బాంబు పేల్చారు. డిసెంబర్ 7లోపు మరిన్ని వలసలు ఉంటాయని చెప్పారు. 24 గంటల్లోపే 2 పెద్ద వికెట్లు పడడంతో గులాబీ పార్టీకి ఇబ్బందిగా మారింది. టీఆర్‌ఎస్‌ కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో నేతల వరుస రాజీనామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు ముందు ముందు మరిన్ని వలసలుంటాయా..? ఫిరాయింపుదారుల్లో ఎవరెవరు ఉన్నారనే అంశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories