టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కష్టాలు...గ్రామాల్లోకి రావొద్దంటూ...

x
Highlights

తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా నిరాశే ఎదురవుతోంది. నియోజకవర్గాల్లో వారికి స్వాగతం పలకాల్సిన జనం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమ...

తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా నిరాశే ఎదురవుతోంది. నియోజకవర్గాల్లో వారికి స్వాగతం పలకాల్సిన జనం గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. తమ గ్రామాల అభివృద్ధికి నిధులివ్వని ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి రావొద్దంటూ తీర్మానాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రజల్లో తిరుగుబాటు రావడంతో తాజా మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ బలంగా ఉందనుకున్న నియోజకవర్గాల్లో కూడా టీఆర్‌ఎస్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేల పరిస్థితిపై హెచ్‌ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎదురీదుతోంది. అక్కడి సిట్టింగ్‌లపై రోజురోజుకూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినా ఈ సారి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బోథ్ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పార్టీ మళ్లీ టికెట్ ఇచ్చింది. అయితే, ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని జనం నిలదీస్తున్నారు. అంతేకాకుండా మా గ్రామాలకు ఎందుకొస్తున్నారంటూ వారి ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు.

తలమడు మండలం కుచ్చులాపూర్ గ్రామంలో చెరువు నిర్మించలేదని గ్రామస్తులు ఆయన్ను అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్లుగా చెరువుకోసం అడుగుతున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గుడిహత్నూర్ మండలం గిర్నూర్, కోల్హరీ, అడేగామా గ్రామాల్లో పర్యటించిన టీఆర్ఎస్ అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికలొస్తే తప్ప.. ఏనాడూ తమ గ్రామాల ముఖం చూడలేదని నిలదీశారు. వీటితోపాటు మరో ఐదు గ్రామాల్లో జనం టీఆర్ఎస్ అభ్యర్థి రావొద్దని తీర్మానాలు చేశారు. దీంతో మొఖం చెల్లని బాపురావు మధ్యలోనే ప్రచారాన్ని ముగించి వెనుతిరిగారు.

ఇక ఖానాపూర్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్‌‌కు జనం షాకిచ్చారు. ఎక్కడికెళ్లినా ఆమెకు నిరాశే ఎదురవుతోంది. ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్‌లో రేఖానాయక్ ప్రచారాన్ని గ్రామస్తులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. రోడ్లు లేక తాము అవస్థలు పడుతుంటే పట్టించుకోలేదని మండిపడ్డారు. గో బ్యాక్ అంటూ జనమంతా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొన్ని చోట్ల నాలుగేళ్లుగా తమను పట్టించుకోని రేఖానాయక్ గ్రామాలకు రావొద్దంటూ జెండాలు పాతారు. ఇలా ఎక్కడకెళ్లినా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో టెన్షన్ పడుతున్నారు రేఖానాయక్.

గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థుల పరిస్థితిని చూసిన ద్వితీయ శ్రేణి నేతలంతా పక్క పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు ప్రయత్నిస్తుండటం వీరికి మరింత కష్టంగా మారింది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే గెలుపు సంగతేమో గానీ, కనీసం ప్రత్యర్థులకు గట్టిపోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories