రేపటితో ముగియనున్న నామినేషన్ల పర్వం..కాంగ్రెస్‌‌‌‌‌లో వీడని ఉత్కంఠత

Submitted by chandram on Sun, 11/18/2018 - 15:47
cong

రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరు స్థానాల్లో అభ్యర్థులింకా ఖరారు కాకపోవడం ఉత్కంఠ రేపుతోంది. మొత్తం 94 స్థానాలకు గానూ 88 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా మిగతా ఆరు సీట్లలో పీఠముడి ఇంకా వీడటం లేదు. తుదిజాబితా కోసం ఎడతెగని కసర్తత్తు జరుగుతూనే ఉంది. కుంతియా, ఉత్తమ్‌లు ఆశావహులతో భేటీలు, సమావేశాలు జరుపుతూనే ఉన్నారు. 

ఇప్పటివరకు ప్రకటించిన 88 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు అంశం తేలిగ్గానే ముగిసినా చివరకు మిగిలిన ఆ ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ యంత్రాంగం కిందా మీదా పడుతోంది. ఎలాంటి ఇబ్బందులు లేని ఆశావహుల సంఖ్య తక్కువగా ఉన్నవి ఒకరు లేదా ఇద్దరు పోటీ పడ్డ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం త్వరగా జరిగిపోయింది. కానీ మిగతా ఆరు స్థానాల్లో ఒక్కోదాని నుంచి ఏకంగా ఐదు నుంచి ఆరుగురు పోటీ పడుతున్నారని తెలుస్తోంది. దీంతో వారందరినీ బుజ్జగించి తుది అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యమవుతోందని చెబుతున్నారు. 

స్క్రీనింగ్‌ కమిటీ నుంచి రాహుల్‌ వరకు ఎంతగా ప్రయత్నించినా ఆ ఆరు స్థానాలపై ఎటూ తేల్చుకోలేకపోయారు. దీంతో దాన్ని రాష్ట్ర నాయకత్వానికే అప్పగించారు. దీంతో కుంతియా, ఉత్తమ్‌లు ఆశావహులతో చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. మరోవైపు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు కూడా జాబితా ఆలస్యం కావడానికి కారణమని చెబుతున్నారు. మిర్యాలగూడ, నారాయణపేట్, దేవరకద్ర, నారాయణఖేడ్, కోరుట్ల, హుజూరాబాద్ స్ధానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో డీకే అరుణ, జైపాల్ రెడ్డి మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకు ముదురుతోంది. తమ వర్గం వారికే టికెట్లు ఇవ్వాలంటూ ఇరువురు నేతలు పట్టుబట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికి ఇవ్వాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మిర్యాలగూడ స్ధానం తన కుమారుడికే ఇవ్వాలంటూ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు నారాయణ ఖేడ్ తనకే కావాలంటూ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ డిమాండ్ చేస్తుండగా కోరుట్ల టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, జువ్వాడి నర్సింగ్ రావులు పోటీ పడుతున్నారు. 

English Title
Tomorrow, last date to file nominations

MORE FROM AUTHOR

RELATED ARTICLES