హైకోర్టు విభజన...జనవరి 1 నుంచి వేర్వేరు కోర్టులు

Submitted by arun on Fri, 08/24/2018 - 15:56
AP High Court

రాష్ట్ర విభజన జరిగిన నాలుగున్నరేళ్ల తర్వాత ఉమ్మడి హైకోర్టు విభజనకు కసరత్తులు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతి సమీపంలో నూతన హైకోర్టు నిర్మాణం పనులు జోరందుకోగా దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చే రెండు రోజుల్లో వెలువడనున్నాయి. డిసెంబర్‌ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతుండగా సంక్రాంతికి కేసుల విచారణ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

విభజన అంశాల్లో కీలకంగా మారిన హైకోర్టు అంశం ఓ కొలిక్కి వస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి నాటికి ఏపీలో ఆ రాష్ట్ర హైకోర్టు పనిచేయడం ప్రారంభించనుంది. అమరావతి పరిధిలోని నేలపాడు, తుళ్లూరు మధ్య.. జ్యుడీషియల్ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే తొలుత పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టాలని అనుకున్న ఏపీ సర్కారు అందుకు అధిక సమయం పడుతుండటంతో తాత్కాలిక ప్రాతిపదికన భవన నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించింది. 

అందులో భాగంగా జ్యూడీషియల్ కాంప్లెక్స్ పనులను గత శనివారం న్యాయమూర్తుల టీమ్ ఒకటి పరిశీలించింది. జడ్జీల బిల్డింగులు, ఐఏఎస్‌ అధికారుల నివాసాల పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఇటు పనుల పురోగతిపై సుప్రీంకోర్టు కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే 20 శాతం మేర పనులు కూడా పూర్తయ్యాయి. 

నిర్మాణ పనులన్నీ అక్టోబరు నాటికి పూర్తవడంతో పాటు ఇంటీరియర్స్‌, ఫర్నీచర్‌ సహా మిగతా పనులన్నీ డిసెంబరు 15 వ తేదీ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఇటు రానున్న రెండు రోజుల్లో హైకోర్టు విభజనపై రాష్ట్రపతి నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 1 నుంచి జ్యూడీషియల్ కాంప్లెక్స్ రెడీ అయినా సంక్రాంతి సెలవుల తర్వాతే.. కేసుల విచారణ ఉంటుందని.. చెబుతున్నారు. 

English Title
Temporary Buildings of AP High Court Getting Ready

MORE FROM AUTHOR

RELATED ARTICLES