ఏడు జోన్లతో జోరుమీదున్న తెలంగాణ!!

ఏడు జోన్లతో జోరుమీదున్న తెలంగాణ!!
x
Highlights

తెలంగాణలో సరికొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు.ఉమ్మడి రాష్ట్ర హయాంలో నెలకొన్న జోనల్ వ్యవస్థతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని,...

తెలంగాణలో సరికొత్త జోనల్ వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు.ఉమ్మడి రాష్ట్ర హయాంలో నెలకొన్న జోనల్ వ్యవస్థతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, స్థానికేతరులు ఉద్యోగాలు తన్నుకుపోతున్నారన్నది ప్రధానమైన ఆరోపణ.. తెలంగాణ రాష్ట్రం వేరుపడ్డాక ఇక జోనల్ వ్యవస్థతో అవసరం లేదని చాలా మంది భావించారు.. ఉమ్మడి రాష్ట్ర సంస్కృతికి చిహ్నంగా మిగిలిపోయిన ఆ వ్యవస్థను తక్షణం తొలగించాలని చాలా మంది అభిప్రాయపడ్డారు.. కానీ జోనల్ వ్యవస్థ ఉంటేనే స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావించిన కేసిఆర్ జోనల్ వ్యవస్థను కొనసాగించాలని, కానీ దానిని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు జోన్లుగా విభజించారు.. వీటిని రెండు బహుళ జోన్లుగా పరిగణిస్తారు.. .జనాభా ప్రాతిపదికన, విస్తీర్ణం ప్రాతిపదికన వీటి విభజన సాగింది. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లుగా వీటికి నామకరణం చేశారు. వాటిలో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రిలను ఒక బహుళ జోన్ గానూ, యాదాద్రి,చార్మినార్, జోగులాంబలను మరో బహుళ జోన్ గానూ పిలుస్తారు.. జోన్లకు తెలంగాణ చరిత్రను చాటే విధంగా పేర్లు పెట్టడంపై ప్రశంసలు పెరుగుతున్నాయి.

జోనల్ వ్యవస్థ కొనసాగింపుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తెలుసుకున్నారు.. మరోవైపు డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ కూడా నాలుగుజోన్లు కావాలని, జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్ మాత్రమే ఉంటే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది..కొత్త రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ నియామకాలకు సంబంధించి జోనల్ విధానం కీలకమని భావించిన కేసిఆర్ దీనిపై బహుముఖ వ్యూహాన్ని ఎంచుకున్నారు.. అందుకే ఒక వైపు ఈటెల సారధ్యంలోని మంత్రుల కమిటీ, మరోవైపు ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను, ఇలా అందరి అభిప్రాయాలను కోరారు.. వాటన్నింటినీ సమగ్రంగా సమీక్షించి పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు.1969నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సంప్రదించిన తర్వాతే కేసిఆర్ ఈ వ్యవస్థపై ఒక నిర్ణయానికి వచ్చారు.

తాజా నిర్ణయం ప్రకారం అత్యధిక జోన్లున్న చిన్న రాష్ట్రంగా తెలంగాణ మారబోతోంది.కొత్త జిల్లాల ఉనికి చాటేందుకు ఆ జిల్లాల వారికి విద్యా, ఉద్యోగావకాశాలు పెరిగే లాగా ఉండాలనే ఎక్కువ జోన్లుగా విభజించారు. విద్యా, ఉపాధి పరంగా కాస్త తక్కువ ప్రమాణాలు కలిగిన జిల్లాలన్నింటినీ ఒక జోన్ లో పెట్టడం వల్ల స్థానికులు అత్యధిక ప్రమాణాలు కలిగిన జిల్లాలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఉండదు.. జిల్లాల భౌగోళిక పరిస్థితులు, విస్తీర్ణం, అక్కడి స్థానిక వాతావరణం ఆధారంగా భావసారూప్యం కలిగిన జిల్లాలను ఒక జోన్ లాగా పరిగణించారు. వికారాబాద్ భౌగోళికంగా హైదరాబాద్ కు దగ్గరగా ఉన్నందున హైదరాబాద్ జోన్ లో చేర్చాలన్న డిమాండ్లు వినిపించినా.. ఆ ప్రాంతం వారు హైదరాబాద్ వారితో పోటీ పడలేరని అందువల్ల పాలమూరు పరిధిలోని జిల్లాలతో ఉండటమే మేలని సిఎం భావించారు. జోన్ల కూర్పులో ఉత్తర, దక్షిణ తెలంగాణ సారూప్యతలను కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి పోస్టులకు ఇప్పటి వరకూ ఓపెన్ కోటా మాత్రమే అమల్లో ఉంది..రాష్ట్రస్థాయి పోస్టుల్లోనూ రిజర్వేషన్లుండాలన్నది ఉద్యోగ సంఘాల భావన.

అయితే దీనికి న్యాయపరమైన అడ్డంకులున్నాయన్న కారణంగానే బహుళ జోనల్ వ్యవస్థపై సిఎం దృష్టి పెట్టారు.రాష్ట్ర కేడర్లో ఉన్న పోస్టులను ఈ బహుళ జోన్ల కేటగిరీలోకి మళ్లిస్తారు. దీనివల్ల రాష్ట్ర కేడర్లో పోస్టులు తగ్గడమే కాదు...బహుళ జోన్లలో పనిచేసిన వారికి పదోన్నతులు కల్పించే వీలుంటుంది.అయితే జోనల్ వ్యవస్థ నిర్ణయం సరికాదంటున్నారు టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్. ఇంకా ప్రతిపాదనల దశలో ఉన్న ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే తెలంగాణ నిరుద్యోగులందరికీ మెరుగైన అవకాశాలు కల్పించినట్లవుతుంది.అలాగే అన్ని చోట్లా సమాంతర అభివృద్ధికి బీజం వేసినట్లవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories