ఆర్ధిక సంక్షోభంలో తెలంగాణ విశ్వవిద్యాలయం

ఆర్ధిక సంక్షోభంలో తెలంగాణ విశ్వవిద్యాలయం
x
Highlights

తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం నిధులివ్వక బకాయిలు వసూళ్లు కాక ఖజానా ఖాళీ అయ్యింది. సిబ్బందికి జీతాలు చెల్లించలేని...

తెలంగాణ విశ్వవిద్యాలయం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వం నిధులివ్వక బకాయిలు వసూళ్లు కాక ఖజానా ఖాళీ అయ్యింది. సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్ధితికి చేరింది. ఆర్ధిక పరిస్ధితి రోజురోజుకు దిగజారుతున్నా ప్రైవేట్ యూజీ అండ్‌ పీజీ కళాశాలల నుంచి రావాల్సిన బకాయిల వసూళ్లలో వర్సిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై‌నే విద్యార్ధులు అధ్యాపకులు గంపెడాశలు పెట్టుకున్నారు.

తెలంగాణ యూనివర్శిటీని ఆర్ధిక కష్టాలు వెంటాడుతున్నాయి. గత బడ్జెట్‌లో కేటాయించిన 9కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి మంజూరు కాకపోవడంతో నిధులు లేక వర్సిటీ ఖజానా నిండుకుంది. నిధులు విడుదల చేయాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. రెండు నెలలుగా సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి రావడంతో ఖాతాలో ఉన్న సొమ్మును ఊడ్చేసి చెల్లింపులు చేశారు. దాంతో మరోసారి బడ్జెట్‌పైనా, నిధుల విడుదలపైనా గంపెడాశలు పెట్టుకుంది. యూనివర్సిటీ మనుగడకు 200కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని విద్యార్ధి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. లేని పక్షంలో విద్యార్ధులు రోడ్డెక్కే పరిస్ధితి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 72 డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలు ఉన్నాయి. ఈ కాలేజీలు ఏటా అఫిలియేషన్ ఫీజులను వర్సిటీకి చెల్లించాల్సి ఉంది. అయితే మూడేళ్లుగా 72 కళాశాలలు బకాయిల చెల్లింపులో మొండికేస్తున్నాయి. ఒక్కో కాలేజీ సుమారు 20 నుంచి 40 లక్షల వరకు బకాయిపడ్డారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని అఫిలియేషన్ ఫీజులను చెల్లించడం లేదు. విద్యార్ధుల నుంచి ఫీజులు భారీగా వసూలు చేసే ప్రైవేట్ కళాశాలలు తెలంగాణ యూనివర్సిటీకి మాత్రం చెల్లించడం లేదని విద్యార్ధి సంఘాలు మండిపడుతున్నాయి. అధికారులు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై బకాయిలు వసూళ్లు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని మండిపడుతున్నారు.

తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. గత బడ్జెట్ నిధులతో పాటు ఈసారి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తే తప్పా యూనివర్సిటీ మనుగడ కష్టమని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories