తెలంగాణలో సమస్యలేంటి? దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి?

తెలంగాణలో సమస్యలేంటి? దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి?
x
Highlights

ఎన్నికల ప్రచారం స్పీడందుకుంది. పార్టీలన్నీ ఓట్ల వేటలో బిజీ అయిపోయాయి. కీలకమైన నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ప్రచారం పదును తేరుతోంది. నామినేషన్ల ఘట్టం...

ఎన్నికల ప్రచారం స్పీడందుకుంది. పార్టీలన్నీ ఓట్ల వేటలో బిజీ అయిపోయాయి. కీలకమైన నామినేషన్ల ఘట్టం పూర్తవడంతో ప్రచారం పదును తేరుతోంది. నామినేషన్ల ఘట్టం పూర్తయిపోయింది కాబట్టి ఇక ప్రచారం స్పీడందుకుటోంది. అయితే ఏ పార్టీ ప్రచారం దేనిపై ఫోకస్ చేస్తుంది అన్నది కీలకం.. ముందస్తు ఎన్నికలకు కారణమైన టిఆరెస్ అసలెందుకు ముందస్తు కోరుకుంటోందో ప్రజలకు సమూలంగా వివరించాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. అంతేకాదు. గత ఎన్నికలలో చేసిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారో కూడా టిఆరెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీలలో కొన్ని నేటికీ నెరవేర్చలేదు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం,ఇంటింటికీ నల్లా నీరు, కోటి ఎకరాలకు సాగు నీరు లాంటి లక్ష్యాలు పూర్తిగా నెరవేర్చని టిఆరెస్ వాటిపై ప్రజలకు వివరణ ఇచ్చుకుంటూ వస్తోంది. అదే సమయంలో కొత్తగా కొన్ని వాగ్దానాలు చేస్తోంది. తమకు మరోసారి అధికారమిస్తే.. మిగిలినవన్నీ సంపూర్ణంగా పూర్తి చేస్తామంటోంది. ఇక కాంగ్రెస్ టిఆరెస్ మేనిఫెస్టోను చూసి ఆపై కొన్ని ప్రజాకర్షక పథకాలను జోడించి తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కాంగ్రెస్ తామొస్తే రైతులకు రెండు లక్షల వరకూ రుణ మాఫీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇలా ప్రతీ రాజకీయ పార్టీ ఏవో కొన్ని అంశాలను నామ్ కే వాస్తే ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతోంది.

కానీ రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సంక్షేమాన్ని, అభివృద్దినీ కాంక్షిస్తూ మేనిఫెస్టోలను రచిస్తున్నాయా అన్నది అనుమానమే.. ఓటర్లలో కీలక భాగంగా ఉన్న రైతులు, మహిళలపై పార్టీ లన్నింటిదీ కంటితుడుపు వాగ్దానమే. వారికి టిక్కెట్ల కేటాయింపులోనూ అన్యాయమే. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈసారి మహిళలకు కొంచెం మెరుగైన స్థానాలు కేటాయించింది. మరే పార్టీ మహిళలకు తగిన సంఖ్యలో సీట్లు కేటాయించలేదు. సమాజంలో కీలకమైన విద్యా వ్యవస్థ బాగుకోసం పార్టీలు మేనిఫెస్టోలో హామీలు ప్రస్తావించడం లేదు. ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై నియంత్రణ, పబ్లిక్,ప్రైవేట్ స్కూళ్లకి ఒకే సిలబస్, ఒకే బోధన విధానం డిమాండ్ ను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు. దళిత, ఆదివాసీ, ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాల బాలికలకు అత్యాధునిక విద్యా ప్రమాణాలు అందించడంలోనూ ఏ పార్టీకి శ్రద్ధ లేదు. .ప్రభుత్వ పాఠశాలలలో మరుగు దొడ్ల నిర్మాణంపై ఏ రాజకీయ పార్టీ తన మేనిఫెస్టోలో స్థానం కల్పించటం లేదు.

అలాగే.. తెలంగాణలో స్త్రీలు, ఆడపిల్లలు, ట్రాన్స్ జెండర్ల రక్షణకై చర్యలు తీసుకుంటామన్న ఊసే చాలా రాజకీయ పార్టీల మేనిఫెస్టోలలో లేదు.
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న మద్యం విక్రయాల వల్ల హైదరాబాద్ నగర శాంతి భద్రతలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. వీటిపై ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో స్థానం కల్పించడం లేదు.సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోడానికి పార్టీలు తమ మేనిఫెస్టోలలో హామీలివ్వాలి. మహిళా రైతుల శ్రమ దోపిడీని గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి.. అలాగే మహిళలకు భూమి హక్కులు ఉండాలి. అలాగే గల్ఫ్ కార్మికులపైనా పార్టీల మేనిఫెస్టోలో స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది... జీవనాధారం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులు అక్కడ అనారోగ్యంతో మరణించినా దిక్కూ మొక్కూ లేని పరిస్థితి ఎదురవుతోంది. పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లేవారు అక్కడ నుంచి తిరిగి రావడానికి పడుతున్న ఇబ్బందులపై ఏ రాజకీయ పార్టీ దృష్టి పెట్టడం లేదు.

ఇక పార్టీలు ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన మరో అంశం హైదరాబాద్ నగరం గురించి.. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం పారిశ్రామిక కాలుష్యంతో సతమతమవుతోంది. అధికారంలోకి వచ్చిన పార్టీలేవీ తీవ్రాతి తీవ్రమైన ఈ సమస్యపై దృష్టి పెట్టడం లేదు. తమ మేనిఫెస్టోలలో వీటి పరిష్కారానికి హామీలివ్వడం లేదు. పర్యావరణం కాపాడటానికి, సహజ వనరుల పరిరక్షణకు రాజకీయ పార్టీలు తమ తమ మేనిఫెస్టొలలో వాగ్దానాలివ్వాలి.. అంతేకాదు గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్లను బాగుపరచడం. గుంతలు లేకుండా చూడటం కూడా అవసరమే. వర్షాకాలంలో నీరు నగరం నడిబొడ్డునే నిల్వ అయిపోతూ నగర ప్రజలకు సమస్యలు సృష్టిస్తోంది. అలాగే అక్రమ కట్టడాలు నగరభౌగోళిక పరిస్థితిని దెబ్బ తీస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రతీ రాజకీయ పార్టీకి విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. ఒక పటిష్టమైన విజన్ ఉండాలి. సామాజిక తెలంగాణ పరిరక్షణకు పార్టీలు కృషి చేస్తామనే హామీ ఇవ్వాల్సి ఉంది. ప్రణయ్ పరువు హత్య సమాజంలో వేళ్లూనుకు పోయిన కుల అంతరాలను పట్టి చూపింది., అనేక కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమ జంటలు రక్షణ కరువై ప్రాణభయంతో కాలం వెళ్లదీస్తున్న దృష్ట్యా పార్టీలన్నీ ఈ సామాజిక సమస్యపై దృష్టి పెట్టాలి.

చేనేత రంగం తెలంగాణ గ్రామీణ జీవన విధానంలో ఆయువు పట్టు.. కులవృత్తుల మనుగడకు చేనేత రంగం బాగుకు అన్ని పార్టీలు మేనిఫెస్టోలలో అట్ట హాసపు హామీలివ్వడమే తప్ప అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకున్నది లేదు.. తెలంగాణ మౌలిక స్వరూపం మారాలంటే, హైదరాబాద్ జీవన ప్రమాణాలు మెరుగు పడాలంటే.. రాజకీయ పార్టీలు ఈ అంశాలని తమ మేనిఫెస్టోలలో పెట్టి.. అధికారం చేపట్టాక వాటిపై ద్రుష్టి పెట్టాలి.. కానీ పార్టీలలో ఈ కమిట్ మెంటే కరువైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories