logo

కోటాపై క్లారిటీ...తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన బీసీ ఓటర్లు

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన బీసీ ఓటర్ల గణన పూర్తికావడంతో... రెండు మూడ్రోజుల్లో బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేసేందుకు పనులు మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.

తెలంగాణలో మొత్తం 12వేల 751 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో లక్షా 13వేల 358 వార్డులుండగా, ఒక కోటీ 37లక్షల 17వేల 469మంది ఓటర్లు ఉన్నారు. జులై నెలాఖరుతో పంచాయతీల పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్పంచ్‌ ఎన్నికల నిర్వహణలో కీలకమైన బీసీ ఓటర్ల గణనను పూర్తిచేసింది. మొత్తం 30 జిల్లాల నుంచి బీసీ ఓటర్ల జాబితాలు అందటంతో రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. మరో వారం రోజుల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

గ్రామ పంచాయతీల్లో మొత్తం బీసీ ఓటర్లు 55.74శాతం ఉన్నట్లు తేలింది. తెలంగాణ రాష్ట్ర నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎస్టీలకు 5.73శాతం కింద 580 పంచాయతీలు, ఎస్సీలకు 20శాతం అంటే 2వేల 70 పంచాయతీలు కేటాయించనున్నారు. బీసీలకు 34శాతం రిజర్వేషన్ కింద 3వేల 440 గ్రామ పంచాయతీలు దక్కనున్నాయి. ఆయా జిల్లాల్లో గ్రామ పంచాయతీల సంఖ్య ప్రకారం రిజర్వుడు పంచాయతీల కోటాను తేల్చనున్నారు. అయితే రిజర్వేషన్‌ కోటా ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీలకు కేటాయించబోయే గ్రామాలను రెండు మూడ్రోజుల్లోనే తేల్చనున్నట్లు తెలుస్తోంది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top