తెలంగాణ మంత్రి వర్గంలో కొత్త ముఖాలకు అవకాశం..రేసులో...

తెలంగాణ మంత్రి వర్గంలో కొత్త ముఖాలకు అవకాశం..రేసులో...
x
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించడంతో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ కూర్పుపై పడింది. మంత్రివర్గంలో పాతకాపులు ఎవరెవరు ఉంటారు..? కొత్త ముఖాలు ఎన్ని...

తెలంగాణలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించడంతో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ కూర్పుపై పడింది. మంత్రివర్గంలో పాతకాపులు ఎవరెవరు ఉంటారు..? కొత్త ముఖాలు ఎన్ని ఉండబోతున్నాయ్..? డిప్యూటీ సీఎం ఛాన్స్ ఎవరికి వస్తుంది..? కొత్త సభాపతి ఎవరు..వంటి అంశాలు ఆసక్తి రేపుతున్నాయి.

కొద్ది గంటల్లో కొలువుదీరనున్న కేసీఆర్ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి, ఆజ్మీరా చందూలాల్ ఓడిపోవడంతో వారి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవాల్సి ఉంది. అలాగే సెకండ్ టర్మ్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కొంత మంది కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. మంత్రి పదవి రేసులో ఉన్నవారి పేర్లు గులాబీ శ్రేణుల్లో చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితో సహా 18 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ఈ మేరకు మంత్రి వర్గ జాబితాను టీఆర్ఎస్ అధినేత ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.


జూపల్లి కృష్ణారావు ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అలాగే పట్నం మహేందర్‌రెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి బెర్త్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూ లాల్‌‌ స్థానంలో అదే జిల్లా నుంచి ఆ సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి డి. ఎస్‌. రెడ్యానాయక్‌ ను మంత్రిపదవి వరించబోతున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నుంచి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాత్రమే విజయం సాధించడం, ఆ జిల్లాకు చెందిన తుమ్మల ఓటమి పాలవ్వడం, ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో తుమ్మల స్థానంలో పువ్వాడకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్‌ మంత్రి వర్గంలో భారీ మార్పులు చేపట్టాలని భావిస్తే మాత్రం అనూహ్యంగా కొత్త వారి పేర్లు జాబితాలో ఉండే అవకాశం ఉంది. ఈసారి కూడా రెండు ఉప ముఖ్యమంత్రి పదవులు కొనసాగవచ్చు. కడియం శ్రీహరి, టి. పద్మారావు గౌడ్, జోగు రామన్న స్థానంలో కొత్త వారిని తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిని మారిస్తే వారి స్థానంలో అరూరి రమేశ్‌ కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన టి. పద్మారావుగౌడ్‌ను మారిస్తే కె.పి. వివేకానంద గౌడ్‌‌కు, జోగు రామన్నను మారిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్‌‌కు బెర్త్‌ ఖాయం కావచ్చు. అలాగే స్పీకర్‌ మధుసూదనాచారి పారాజయం పాలవ్వడంతో ఆయన స్థానంలో ఈటల రాజేందర్‌‌ను సభాపతి స్థానంలో కూర్చోబెడతారని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories