భారీగా పెరిగిన తెలంగాణ నేతల ఆస్తులు

భారీగా పెరిగిన తెలంగాణ నేతల ఆస్తులు
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఆస్తులు నాలుగేళ్లలో గణనీయంగా పెరిగాయి. స్థిరాస్తి వ్యాపారాలు, కంపెనీల్లో పెట్టుబడులు,...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ఆస్తులు నాలుగేళ్లలో గణనీయంగా పెరిగాయి. స్థిరాస్తి వ్యాపారాలు, కంపెనీల్లో పెట్టుబడులు, కాంట్రాక్టులు, వ్యవసాయ భూములు, గృహాలు ఇలా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు చూపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ప్రధాన నాయకుల ఆస్తులు భారీగా పెరిగాయి. ఓ వైపు ఆస్తులు పెరుగుతున్నా ఆదాయం తగ్గుతోందని వెల్లడించారు. ఇక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ ఆదాయం పెరిగింది. గత ఎన్నికల నాటికి 15.27 లక్షల ఆదాయం ఉండగా నాలుగేళ్లలో 2.07కోట్లకు పెరిగింది. కేటీఆర్ వార్షిక ఆదాయం గత ఎన్నికల నాటికి 51.09 లక్షలు ఉండగా 4.82కోట్లుగా చూపించారు.

కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తుల విలువ నాలుగేళ్లలో 247 కోట్లు పెరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుల ఆస్తులు పెరిగినా ఆదాయం తగ్గినట్టు చూపించారు. ప్రధాన పార్టీల నుంచి బరిలోని అభ్యర్థుల కుటుంబం ఆస్తుల విలువ రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగేళ్ల క్రితం నాటి ప్రమాణ పత్రాలను పరిశీలిస్తే అభ్యర్థుల ఆస్తులు రోజుకు కనీసం 5వేలకు తగ్గకుండా పెరుగుతూ ఉంది.

వ్యవసాయంలో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయపన్ను శాఖకు సమర్పించిన రిటర్నుల్లో కేసీఆర్ దాదాపు కోటి రూపాయలు సంపాదించినట్టు పేర్కొన్నారు. 2014 ప్రమాణపత్రంలో సీఎం వ్యక్తిగత, హిందూ అవిభక్త కుటుంబం కింద 15లక్షల ఆదాయం ఉన్నట్టు చూపించారు. నాలుగేళ్లలో సీఎం వ్యక్తిగత, హెచ్‌యూఎఫ్ ఆదాయం దాదాపు 2కోట్లకు చేరింది. అందులో వ్యవసాయంపై వచ్చిన ఆదాయం 91.52లక్షలుగా పేర్కొన్నారు. ఇక కొడుకు కేటీఆర్, కోడలు అదే స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. వ్యవసాయంపై ఇరువురికీ కలిపి 84లక్షల ఆదాయం వచ్చినట్టు ప్రమాణ పత్రంలో చూపించారు. అలాగే, వివిధ సంస్థల్లో పెట్టుబడుల కింద 79.65 లక్షల లాభాలు వచ్చినట్టు తెలిపారు. ఇక తలసాని శ్రీనివాస్ వ్యవసాయ ఆదాయంగా 2.05లక్షలుగా చూపించారు.

మరికొందరు అభ్యర్థులైతే గత ఎన్నికల్లో ఆస్తుల విలువను తక్కువగా చూపించారు. కానీ, నాలుగేళ్లలో ఇతరత్రా ఆదాయం పెరిగింది. కొందరు ఎమ్మెల్యేలకు వేతనాల రూపంలో లభించిన ఆదాయం వ్యక్తిగత ఆస్తుల కింద చూపించారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గత ఎన్నికల్లో ఆదాయం 9లక్షల 52వేల 738గా చూపించారు. నాలుగేళ్ల తర్వాత ప్రస్తుతం తన ఆదాయం 3.33కోట్లకు పెరిగింది. మంత్రి లక్ష్మారెడ్డి గత ఎన్నికల్లో కేవలం 77.54లక్షల ఆస్తులున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం కుటుంబ ఆస్తుల విలువ 17.29కోట్లుగా చూపించారు. దీంతో ఆస్తుల విలువ ఏకంగా 2130శాతం వరకూ పెరిగినట్టు వెల్లడైంది.

కాంగ్రెస్ అభ్యర్థులు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్శింహ, జానారెడ్డిల ఆస్తులు భారీగా పెరిగినా ఆదాయం తగ్గినట్టు ఆదాయపన్ను రిటర్నుల్లో పేర్కొన్నామని ప్రమాణ పత్రంలో చూపించారు. గత ఎన్నికల్లో పేర్కొన్న ఆస్తుల విలువతో పోలిస్తే ఒక్క రూపాయి కూడా పెరగలేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అయితే, ఆయన ఆదాయం మాత్రం గణనీయంగా 70శాతం తగ్గిందని వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories