వ్యవసాయం ఇక పండుగే

వ్యవసాయం ఇక పండుగే
x
Highlights

తెలంగాణ సర్కారు ఈ బడ్జెట్లో సాగునీటికే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగు భూముల విస్తీర్ణం పెంచడం, తాగు-సాగు నీరు కల్పించడం,...

తెలంగాణ సర్కారు ఈ బడ్జెట్లో సాగునీటికే అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగు భూముల విస్తీర్ణం పెంచడం, తాగు-సాగు నీరు కల్పించడం, వ్యవసాయంతో పాటు వ్యవసాయాధారిత ఉపాధిలో అవకాశాలు మెరుగుపరచడానికే కేసీఆర్ ప్రాధాన్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణలో అత్యధిక భూముల్ని సారవంతం చేసే కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు కేటాయింపులు భారీగా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి బడ్జెట్ కేటాయింపులపై దృష్టి సారించారు. రానున్న బడ్జెట్లో సాగునీటి రంగం కేటాయింపులు భారీగా పెంచాలని, వ్యవసాయ ఉత్పత్తులతో పాటు ఉత్పాదకత లక్ష్యాలను కూడా అధిగమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్‌లో అధిక శాతం నిధులను సాగునీటికే మళ్లించాలని, ఆ దిశగా బడ్జెటేతర నిధులను సైతం భారీగా వినియోగించాలని నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా 50 వేల కోట్ల వ్యయంతో మూడు భారీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. కేటాయింపులకు తగినట్టుగానే ప్రాజెక్టుల పనులు కూడా శరవేగంగా జరగాలని ఆర్థిక, సాగునీటి శాఖల అధికారులకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకాలను సాధారణ ఎన్నికలకు ముందే పూర్తి చేసి.. ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. సాగునీటి కోసం బడ్జెట్‌లో ఏటా 25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఈసారి అంతకు రెండింతలుగా.. అంటే 50 వేల కోట్ల రూపాయలు వెచ్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర బడ్జెట్‌ నుంచి 30 వేల కోట్లు కేటాయించాలని, మరో 20 వేల కోట్లు రుణంగా సమీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కొత్తగా మరో 15 వేల కోట్లు, సీతారామ ఎత్తిపోతల పథకానికి 5 వేల కోట్లు రుణంగా సమీకరించాలని భావిస్తున్నారు. బడ్జెట్‌ తయారీ కూడా ఈ అంచనాలు, లక్ష్యాలకు అనుగుణంగానే ఉండాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖకు సూచించినట్లు సమాచారం.

తెలంగాణ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరంలోనే 24,780 కోట్ల రుణం తీసుకుంది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, విజయా బ్యాంకులు ఆ రుణాలు మంజూరు చేశాయి. అందులో కొంత మేర నిధుల ఖర్చు కూడా జరిగిపోయింది. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 15 వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 16.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయినందున మరింత వేగం పెంచేందుకు నిధులు వెచ్చించాలని భావిస్తోంది. ఇక 7.5 లక్షల ఎకరాలకు సాగునీరందించే సీతారామ ప్రాజెక్టుకు రెండో ప్రాధాన్యమిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే 35 శాతం పనులు పూర్తవడం విశేషం.

వచ్చే బడ్జెట్‌లో ఈ మూడు ప్రాజెక్టులపైనే ప్రభుత్వం ఫోకస్‌ చేస్తుండగా కాళేశ్వరం ప్రాజెక్టుకు 9 వేల కోట్లు, పాలమూరుకు 4 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు 1,500 కోట్లు అవసరం అవుతాయని సాగునీటి శాఖ ప్రతిపాదనలు పంపింది. తుది కేటాయింపులకు సంబంధించి ముఖ్యమంత్రి సమీక్ష సందర్భంగా ఆ ప్రతిపాదనల్లో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. మొత్తానికి తెలంగాణ సర్కారు వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మొదట్నుంచీ చెబుతున్నదానిక అనుగుణంగానే కొత్త బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయంటున్నారు పరిశీలకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories