ఉత్తమ్ ఒంటరి ?

Submitted by arun on Thu, 06/21/2018 - 10:55

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఒంటరవుతున్నారా.. సీనియర్లంతా ఏకమై.. అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి వెళ్లడంతో.. ఉత్తమ్ వెంట ఎవరూ కనిపించడం లేదా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు మాజీ మంత్రులంతా యాంటీ ఉత్తమ్ గ్రూపులో చేరినట్లేనా.. తాజా పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి.?

టీ కాంగ్రెస్‌లో.. నిన్న, మొన్నటి వరకు ఉత్తమ్ వెనుకే ఉన్న పార్టీ నాయకులంతా.. ఇప్పుడు ఆయన వ్యతిరేక గ్రూపులు జతకట్టినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్లు.. 6 నెలలుగా ఆయన పనితీరుపై అధిష్టానానికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు. ఉత్తమ్ సపోర్టర్స్‌గా ఉన్న శ్రీధర్ బాబు, ఇటీవలే పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కూడా తాజాగా భట్టి విక్రమార్క వర్గానికి చేరినట్లు కనిపిస్తోంది. 

ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని వేదికగా చేసుకొని.. కాంగ్రెస్ సీనియర్లు ఢిల్లీకి చేరారు. రాహుల్‌కు విషెస్ చెప్పడంతో పాటు తామొచ్చిన విషయం కూడా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్‌తో జరిగిన భేటీలో.. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై చర్చించినట్లు ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ప్రస్తుతమున్నట్లు పార్టీ ఉంటే కష్టమని చెప్పినట్లు తెలిపారు. పార్టీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరముందని రాహుల్‌కు వివరించామన్నారు. వ్యక్తిగతంగా.. ఎవరికి వారు పార్టీ పనితీరుపై రాహుల్‌కు ఫిర్యాదులు సమర్పించినట్లు క్లారిటీ ఇచ్చారు.

ఇది పక్కనబెడితే.. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీని నడుపుతున్నారని సీనియర్లు రాహుల్‌కు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో చర్చించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. భవిష్యత్తులో పార్టీకి నష్టం జరగడం ఖాయమని.. భట్టి విక్రమార్క, డీకే అరుణ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వెంటనే పార్టీ పరిస్థితిపై వ్యక్తిగతంగా అందరు సీనియర్లతో మాట్లాడి.. పార్టీ పరిస్థితిని అంచనా వేసి.. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా స్టేట్‌మెంట్ మాత్రం మరోలా ఉంది. టీ కాంగ్ లీడర్లు.. ఉత్తమ్‌పై కంప్లైంట్ చేశారన్నది అవాస్తవమని.. అవన్నీ రూమర్లేనని కొట్టిపారేశారు.

English Title
Telangana Congress leaders seek to drop Uttam Kumar Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES