హస్తినకు చేరిన టీ.కాంగ్రెస్ పంచాయతీ...ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఫిర్యాదు చేయనున్న సీనియర్ల

Submitted by arun on Wed, 06/20/2018 - 07:58

తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ హస్తినకు చేరింది. గతకొంత కాలంగా పీసీసీ చీఫ్ వర్సెస్.. ఉత్తమ్‌ వ్యతిరేక వర్గం మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు పార్టీలో వర్గపోరు తీవ్రం కావడంతో పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఉత్తమ్ వ్యతిరేక వర్గం నేతలకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంతో ఆ నేతలంతా ఢిల్లీకి వెళ్లారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రమైంది. ఎన్నికల సమయం దగ్గరపడిన సమయంలో పార్టీలోని సీనియర్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. సీనియర్లంతా ఒకేతాటిపైకి వచ్చి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారికి టైమ్‌ ఇవ్వడంతో రేపు ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 

ఇటీవల ఢిల్లీలో మూడురోజులపాటు మకాం వేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. హైదరాబాద్ చేరుకోగానే పార్టీ నేతలకు ఎలాంటి సమాచారం లేకుండా గాంధీభవన్‌లో మీడియా సమావేశం పెట్టడం పార్టీలోని మిగిలిన నేతలకు మింగుడుపడలేదు. దీంతో ఉత్తమ్‌పై అందరూ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. 

రాహుల్‌గాంధీ బర్త్‌డే కావడంతో ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రులు డీకే అరుణ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు తమకు సమయం ఇవ్వాలని రాహుల్‌ను కోరారు. దీంతో రాహుల్ వారికి బుధవారం ఉదయం 10గంటలకు సమయమిచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న ఆ నేతలంతా ఉత్తమ్‌పై కచ్చితంగా ఫిర్యాదు చేస్తారని పార్టీలో ఊహాగానాలు సాగుతున్నాయి. 

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ సమయం ఇవ్వడంతో మిగిలిన నేతలు కూడా ఢిల్లీకి బయల్దేరినట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఉత్తమ్ పార్టీలోని నేతలందరినీ కలుపుకొని పోవడం లేదని, పీసీసీ చీఫ్ తీరు ఇలా ఉంటే.. పార్టీ అధికారంలోకి రావడం కష్టమని రాహుల్‌కు చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఎవరెన్ని ఫిర్యాదులు చేసిన తన పదవికి వచ్చే నష్టమేమీ లేదన్న ధీమాలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఢిల్లీ పంచాయతీ తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి. 

English Title
Telangana Congress Leaders Seek to Drop Uttam Kumar Reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES