19 స్థానాలపై సస్పెన్స్...వ్యూహాత్మకంగా కాంగ్రెస్ మూడో జాబితా...

Submitted by arun on Fri, 11/16/2018 - 10:58

కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. తుది జాబితా విడుదలకు అంతా సిద్ధమైందని నిన్నంతా హడావిడి చేసిన కాంగ్రెస్ నేతలు చివరికి అభ్యర్థుల పేర్లను రేపు ప్రకటిస్తామని తీరిగ్గా తెలిపారు. ఇంతకీ కాంగ్రెస్ మూడో లిస్ట్ విడుదల ఎందుకు జాప్యమౌతోంది. కోదండరాం ఢిల్లీ వెళ్ళడానికి కాంగ్రెస్ లిస్ట్ వాయిదా పడటానికి సంబంధం ఉందా..? జనగామ సీటు కోసం ఢిల్లీలో పొన్నాల సాగిస్తున్న మంతనాలు ఎంతవరకు వచ్చాయి..?

మూడో జాబితా అంశంలో కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మొదటి, రెండో జాబితాల విడుదల తర్వాత అసంతృప్తి జ్వాలలు ఎగసిపడడంతో తుది జాబితా విడుదలను వాయిదా వేశారు. పెండింగ్‌లో పెట్టిన 19 స్థానాలకు విపరీతమైన పోటీ ఉండడంతో ఢిల్లీలో భారీగానే కసరత్తు సాగుతోంది. ఇప్పటికే అనేక చోట్ల అశావహులు నిరసనలకు దిగడంతో పాటు రెబెల్స్ గా బరిలోకి దిగేయత్నాల్లో ఉండడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. మూడో జాబితా విడుదల తర్వాత మరోసారి అసంతృప్తి సెగలు రేగకుండా ఉండేందుకు ఈ సారి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆఖరు జాబితాకు విడుదలకు ముందే అసంతృప్తులు, ఆశావహులకు ఢిల్లీ పిలిచి బుజ్జగించాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థుల ఆఖరి లిస్ట్‌ను రేపు ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. 

తుది జాబితా ప్రకటించడంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నామని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా తెలిపారు. అంతేకాదు అసంతృప్తులు ఆశావహులను సముదాయించేందుకు కమిటీలను కూడా కాంగ్రెస్ హైకమాండ్ నియమించారు. సీనియర్ నాయకుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలు 19 నియోజకవర్గాల ఆశావహులందర్నీ బుజ్జగించే పనిని అప్పగించారు. దీంతో ఇవాళంతా హస్తినలో బుజ్జగింపుల పర్వం సాగనుంది.

అటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మరోసారి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ తుది జాబితా కోసం కసరత్తు జరుగుతున్న సమయంలో ఆయన ఢిల్లీ వెళ్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి పొత్తులో భాగంగా టీజేఎస్‌కు 8 స్థానాలు కేటాయించగా ఆ పార్టీ మాత్రం 12 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. పైగా కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన స్టేషన్ ఘన్ పూర్, అసిఫాబాద్ తో పాటు టీడీపీకి కేటాయించిన మహబూబ్ నగర్  స్థానాల్లో కూడా బరిలో ఉంటామని తేల్చి చెప్పింది. దీంతో సీట్ల సర్దుబాటు అంశంతో పాటు జనగామ నుంచి కోదండరాం పోటీ చేసే విషయంపై చర్చించేందుకు కోదండరామ్ ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. 

మరోవైపు జనగామ సీటు ఆశిస్తున్న పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలోనే మకాం వేశారు. ఆయన నిన్న రాహుల్‌ ని కలిశారు. 35 ఏళ్లుగా జనగామకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని పొన్నాల రాహుల్ కు వివరించారు. జనగామ విషయంలో అన్ని అంశాలను కుంతియాకు వివరించాలని పొన్నాలకు సూచించిన రాహుల్ అన్నీ తను చూసుకుంటానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో మూడో జాబితాలో తన పేరు ఉంటుందని పొన్నాల ధీమాగా ఉన్నారు. మరి మూడో లిస్టులో పొన్నాల పేరు ఉంటుందా లేదా 19 స్థానాల ఆశావహులు హైకమాండ్ బుజ్జగింపులకు లొంగుతారా అనేది వేచి చూడాలి.

English Title
Telangana Congress 3rd Candidates List Release Postponed to Tomorrow

MORE FROM AUTHOR

RELATED ARTICLES