15 యేళ్ల సంప్రదాయానికి మంగళం పాడనున్న కేసీఆర్ ...ఆశావహుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ

Submitted by arun on Fri, 06/15/2018 - 13:35
KCR

గత 15 యేళ్లుగా వస్తున్న సంప్రదాయానికి మంగళం పాడేందుకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఆఖరు నిముషంలో అభ్యర్థులను ప్రకటించే రివాజును పక్కన పెట్టేందుకు రెడీ అయ్యింది. గత మూడు ధఫాలుగా చివరి నిముషంలో జాబితాను ప్రకటించి ఇబ్బందులను ఎదుర్కోవడం.. ఈ సారి ఆ సంప్రదాయాన్ని కాదని.. కనీసం రెండు నెలల ముందే టిక్కెట్ల లిస్టు వెలువరించేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.. గులాబీ బాస్. దీంతో సిట్టింగులతో పాటు, ఆశావహుల్లో ఆందోళన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 

ముందస్తా.. లేక అనుకున్న సమయానికా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. కనీసం రెండు నెలల ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. 2004 నుంచి 2014 వరకు.. మూడు సార్లు ఎదుర్కొన్న ఎన్నికల్లో.. చివరి నిముషంలో అభ్యర్థులను ప్రకటించి.. రకరకాల ఇబ్బందులను అనుభవించాల్సి వచ్చింది. ము‌ఖ్యంగా టిక్కెట్ల కేటాయింపుల్లో గందరగోళం, టిక్కెట్ రాని పార్టీ నాయకులు.. రెబల్‌గా బరిలోకి దిగడం వంటి కారణాలతో.. జాబితాను ముందస్తుగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. 

చివరి నిమిషంలో టికెట్లు ప్రకటించడం వల్ల లాభం కంటే.. నష్టమే ఎక్కువ అన్న ఆలోచనలో గులాబి బాస్ ఉన్నారు. టికెట్లు రాని సిట్టింగులు, ఆశావాహులు తిరుగుబాటు చేసినా నష్ట నివారణకు తగిన సమయం ఉండాలంటే ముందస్తుగానే టికెట్లు ప్రకటించడం ఉత్తమమని.. భావిస్తున్నారు. 2004 లో కాంగ్రెస్ తో పొత్తు కారణంగా.. టికెట్ల పంచాయితి చివరి వరకు తెగలేదు. 2009 లోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. చాలామంది నాయకులు రెబల్‌గా పోటీ చేసి.. కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టారు. 2014 లో కూడా నామినేషన్ గడువు ముగిసే సమయానికి అభ్యర్థులను ప్రకటించారు. దీంతో గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని.. ఈ ధఫా ముందస్తుగానే టికెట్లను ప్రకటించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఒకవేళ షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు ఏప్రిల్ లో జరిగితే.. జనవరిలోనే టికెట్లను ప్రకటిస్తానని కేసీఆర్ హమీ ఇచ్చిన్నట్లు.. పలువురు సీనియర్లు చెబుతున్నారు. 

మరోవైపు సీట్ల కేటాయింపు విషయంలో సిట్టింగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు టికెట్లు వస్తాయో.. రావో అన్న టెన్షన్‌ పట్టుకుంది. ప్రస్తుతమున్న 90 మంది ఎమ్మెల్యేల్లో.. కనీసం 40 మంది పనితీరు సరిగా లేదని రకరకాల సర్వేలు తేట తెల్లం చేస్తున్నాయి. పనితీరు మెరుగు పరుచుకోకుంటే వచ్చే ఎన్నికల్లో కష్టమే అని గతంలో కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ జాబితాలో తమ పేరు ఉందా అన్న ఆందోళనలో చాలా మంది ఎమ్మెల్యేలున్నారు. ఇటు ఆశావహుల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. తమ పేర్లు టిక్కెట్ల లిస్టులో ఉంటాయో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా.. టిక్కెట్లు రానివారిని ఎలా బుజ్జగిస్తారనే దానిపైనే టీఆర్ఎస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని.. రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

English Title
Telangana CM KCR Strategy For 2019 Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES