వెంటనే జన గణన జరపండి: సీఎం

వెంటనే జన గణన జరపండి: సీఎం
x
Highlights

సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతి ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రత్యేక అధికారుల...

సుదీర్ఘంగా సాగిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతి ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రత్యేక అధికారుల నియామకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు నూతన ఉద్యోగాల భర్తీకి కేబినెట్ ఆమోదం ప్రకటించింది.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రగతిభవన్‌లో ఏడు గంటల పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశం అజెండాలోని 50అంశాలపై చర్చించింది. పంచాయతీ రాజ్‌ అంశాలపై సుదీర్ఘ చర్చ అనంతరం వచ్చే నెల రెండవ తేది నుంచి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12 వేల 751కి చేరనుంది. అయితే, నిర్ణీత సమయానికి ఎన్నికలు నిర్వహించని కారణంగా ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది

బీసీల రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేసేందుకు వీలుగా తక్షణమే బీసీ జనాభా గణన చేపట్టాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 119 బీసీ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో నూతన సిబ్బంది నియామకంపై చర్చించారు. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం వంద రూపాయల చొప్పున ఎకరానికి మించకుండా ఇవ్వడంతో పాటు ఆస్తి పన్నును మినహాయించాలని నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలని నిర్ణయించారు. వీటితోపాటు రాష్ట్రంలో నూతనంగా18 అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు శాఖ కోసం 11 వేల 577 వాహనాల కొనుగోలుకు అనుమతించింది. సూర్యాపేటలో వైద్య కళాశాల ఏర్పాటు సహా సిబ్బంది నియామకం చేపట్టాలని నిర్ణయించారు.

గతంలో నక్సలైట్లు అమర్చిన మందుపాతర పేలుడులో మృతిచెందిన మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబానికి షేక్‌పేటలో 600 గజాల ఇంటి స్థలం కేటాయించారు. భారత్‌ - పాక్‌ సరిహద్దులో మృతిచెందిన వీర జవాన్‌ ఫిరోజ్‌ఖాన్‌ కుటుంబానికి కూడా షేక్‌పేటలోనే 200 గజాల ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించారు. జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అవకాశాల పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories